కమల్‌హాసన్‌కే కాదు.. ఇప్పుడు ప్రతివాడికి తన తెలివిని చూపించాలంటే.. తాను ఓ మేథావినని నిరూపించుకోవాలంటే హిందువులను కించపరచడం, అగ్రవర్ణాలను కించపరడం, లేదా ఫెమినిజంను ప్రోత్సహిస్తూ మాట్లాడటం అనేవి కామన్‌గా మారిపోయాయి. ఇక మరికొందరు దేశప్రముఖ వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడితే వార్తల్లో ఉంటామని భావిస్తున్నారు. గతంలో కూడా కమల్ అనేక సార్లు హిందు దేవుళ్లను, రామాయణం, మహాభారతం వంటి మహాగ్రంథాలను, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి వారిని అవహేళన చేస్తూ మాట్లాడాడు. కానీ మన పురాణాలను ఎవ్వరూ సరిగా అర్ధం చేసుకోలేని నిగూఢమైన, కాలమాన పరిస్థితులకు విరుద్దంగా మానవాళి జీవించి ఉన్నంతకాలం వారికి సన్మార్గాన్ని చూపే కావ్యాలుగా వాటిని ఎందరో గుర్తిస్తున్నారు. విదేశీయులు సైతం రామాయణం, మహాభారతం వంటి వాటిలోని మర్మాన్ని అర్థం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. మన గ్రంథాలను, వేదాలను తస్కరించి, పరిశోధనలు జరుపుతున్నారు. వ్యక్తిగత వికాసానికి, మానవ విలువలకు శ్రీకృష్ణుని భగవద్గీతను ప్రామాణికంగా చేసుకొని, తమ విద్యార్ధులకు బోధిస్తున్నారు. కానీ మన వారు మాత్రం కుహనా మేథావులుగా మారుతున్నారు.
కంచె ఐలయ్య వంటి వారు 'వై ఐయామ్ నాట్ ఎ హిందు' వంటి వివాదస్పద రచనలు, అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. మరికొందరు యూనివర్శిటీల్లో యువత పేరుతో, లౌకిక వాదం పేరుతో దేశవ్యతిరేక శక్తులను సమర్థిస్తూ నిరసనలు, జాతి వ్యతిరేకుల ప్రసంగాలు, వారిని పలు చోట్లకు ముఖ్యఅతిధులుగా పిలుస్తున్నారు. దీనిని ఆదిలోనే తుంచేయాల్సిన అవసరం ఉంది. గొప్ప గొప్ప విదేశీ మేథావులు సైతం మహాత్మాగాంధీ పాటించిన విలువలను చూసి, ఆయన గురించి అసలు వాస్తవాలను గ్రహించి, మాంస రక్తాలతో నిండిన ఓ వ్యక్తి ఈ క్రీస్తు శకంలోనే అందరి మద్యతిరుగాడాడా? అనే విషయాన్ని మన భవిష్యత్తు తరాలు నిజమని భావించలేరని సూత్రీకరించారు. గాంధీని గుడ్డిగా తప్పుపట్టే పలువురికి గాంధీ అసలు వ్యక్తిత్వం ఏమిటో బోధిస్తున్నారు. చాలామంది అంబేడ్కర్ వంటి మేథానిని సైతం బడుగు, బలహీన వర్గాలకు, దళితుల పక్షపాతిగా చూపి తమ స్వార్థపు మనుగడ సాగిస్తున్నారు. దేశంకోసం ఏమి త్యాగాలు చేశారో తెలియని నెహ్రూని, మహ్మద్ అలీ జిన్నాను, జగ్జీవన్‌రామ్, పూలే వంటి వారిని తెరపైకి తెచ్చి కులాల కంపులోకి దించుతున్నారు. కమల్ గతంలో మహాత్మాగాంధీ గురించి ఇలాంటి తప్పుడు కూతలే కూసి, ఆయన్ను హిందు వ్యతిరేకిగా, దేశవిభజనకు కారకునిగా చూపించి, నెహ్రూ, జిన్నా వంటి వారు పన్నిన కుట్రలను బయట పెట్టకుండా గాంధీని దూషించి, 'హేరామ్' వంటి చిత్రాలు తీసి, తర్వాత తాను గాంధీ గురించి తప్పుగా మాట్లాడానని, భావాలు మార్చుకున్నానని పశ్చాత్తాపం ప్రకటించాడు.
ఇప్పుడు మరోసారి ఆయన మహాభారతాన్ని, ద్రౌపదిని హేళన చేస్తూ నోరుజారాడు. 'విశ్వరూపం' సమయంలో తమిళనాడులోని ముస్లింలు ఆయన్ను చంపడానికి కూడా వెనుకాడని పరిస్థితుల్లో తప్పును జయలలిత మీద తోసి, ముందుగా తెలుగుతో పాటు ఇతరభాషల్లో విడుదల చేశాడు. తాను ఈ దేశం విడిచి వెళ్లిపోతానని కంట నీరు పెట్టుకుని, ముస్లిం నాయకుల కాళ్లుగడ్డాలు పట్టుకున్నాడు. అందరి సింపతీని సంపాదించాడు. ఒక నటునిగా ఆయనను మనం గౌరవిస్తాం. కానీ తానే మేథావిననే ముసుగులో ఖురాన్, బైబిల్‌లోని తప్పులను, ట్రిపుల్ తలాక్‌లను వ్యతిరేకించి, విమర్శించే దమ్ములేని కమల్ వంటి కుహనా మేథావులకు బుద్దిచెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇండియాలో ఉండి జాతిపిత గాంధీని వ్యతిరేకించే వారు, ఆయనను తప్పుగా చూపిస్తూ వ్యాఖ్యలు, సినిమాలు తీసేవారు దమ్ముంటే అంబేడ్కర్‌ని తప్పుగా చూపించగలరా? జర్మనీకి పోయి హిట్లర్‌కు వ్యతిరేకంగా, పాకిస్థాన్‌కు వెళ్లి మహ్మద్ అలీ జిన్నాను తప్పుగా చూపిస్తూ సినిమాలు తీయగలరా? మన దేశ ప్రజాస్వామ్యంలోని లొసుగులను క్యాష్ చేసుకుని, కుల మతాలతో కుళ్లిపోయిన సమాజంలో ఓట్ల రాజకీయాలు చేసే నేతలున్నంత కాలం మన దేశంలో ఇది సర్వదా మామూలే.