ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాదు.. చివరకు చిన్న హీరోలు కూడా పక్కనే ఉన్న కోలీవుడ్‌ని, ఎక్కడో ఉన్న బాలీవుడ్‌ని కూడా ఏలాలనుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగా తమ చిత్రాల కథలను, డైరెక్టర్లను, హీరోయిన్లు, ఇతర టెక్నీషియన్స్‌తో పాటు ఆయా భాషల్లో కూడా గుర్తింపు ఉన్న ప్యాడింగ్‌ను చూసుకుంటున్నారు. మహేష్, బన్నీ నుంచి నాగచైతన్య, సందీప్‌కిషన్ వరకు అందరూ అదే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అదే పని వైపు ఓ యంగ్ అండ్ డైనమిక్ హీరో అడుగులు వేస్తున్నాడని సమాచారం. వైవిధ్యభరితమైన, ప్రయోగాత్మకమైన కథలను, వరుస విజయాలను పక్కపక్కన పెడితే అది హీరో నిఖిల్ అవుతుంది. 'స్వామి...రా..రా' నుంచి ఆయన చేసిన, చేస్తున్న చిత్రాలన్నీ ఆ కోవలోకే వస్తాయి. 'కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య' చిత్రాలతో పాటు తాజాగా పెద్ద నోట్ల రద్దు సమయంలో విడుదలై సంచలన విజయం సాధించిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వరకు ఆయన ఇదే ధోరణిలో సాగుతున్నాడు.
కాగా ప్రస్తుతం ఈ యంగ్ హీరో తనకు మొదటి సూపర్‌హిట్‌ను అందించి, తన కెరీర్‌ను మార్చివేసిన సుదీర్‌వర్మ దర్శకత్వంలో 'కేశవ' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందుతోంది. సాధారణంగా మనుషులకు ఎడమ వైపు గుండె ఉంటుంది. కానీ ఈ చిత్రంలో హీరోకు కుడివైపు గుండె ఉంటుంది. అలాంటి వారికి కోపమే కాదు..ఏ ఎమోషన్స్ కూడా పెద్దగా ఉండకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూల్‌గా ఉండాలి. అలాంటి అనారోగ్యం ఉన్న హీరో పగ తీర్చుకోవాల్సివస్తే కూల్‌గా రివేంజ్ ఎలా తీర్చుకున్నాడు? అనే వైవిధ్యభరితమైన కథాంశంతో ఈచిత్రం రూపొందుతోంది. కాగా ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ బాగా ఆకట్టుకుంది. కాగా ఈనెల 22న ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. సినిమాను మే 7న ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం తర్వాత నిఖిల్ నాగార్జునతో కలసి చందుమొండేటి దర్శకత్వంలో ఓ చిత్రం ఒప్పుకున్నాడని సమాచారం. ఇదే సమయంలో మరో ఆసక్తికర వార్త కూడా చక్కర్లు కొడుతోంది. అవార్డు చిత్రాలను, వైవిధ్యభరితమైన చిత్రాలను తీసే తెలుగువాడైన నగేష్ కుకునూర్ ఇటీవలే నిఖిల్‌కి ఓ స్టోరీ చెప్పాడట. స్టోరీ కొత్తదనంతో అద్భుతంగా ఉండటంతో ఈ చిత్రాన్ని మొదటి సారిగా నగేష్ కుకునూర్ పూర్తి కమర్షియల్ ఫార్మెట్‌లోనే హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిఖిల్‌తో చేయనున్నారని సమాచారం, నిఖిల్‌ని చూస్తే కాస్త ఉత్తరాది ఫేస్‌లుక్స్ బాగానే కనిపిస్తాయి. దానికి తోడు టాలెంట్ ఉంది. మరోపక్క నగేష్ కుకునూర్ వంటి దర్శకుడుంటే ఇక ఈ హీరోకు ఈ చిత్రం గొప్ప పేరుతో పాటు మరో విజయాన్ని అందించడం కూడా ఖాయమంటున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.