విలక్షణమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్న నటుడు కమల్ హాసన్. అతను ఏమనుకున్నా అది వెంటనే బయటకు వెళ్ళకక్కడం అతని నైజం. ఎంతో ధైర్యంతో ఆ అనుకున్న విషయాన్ని ప్రకటిస్తాడు. అది ఎంతటి విషయమైనా సరే ముందు వెనక చూసుకోకుండా బయటపెట్టేయడం ఆయన నైజాన్ని చాటుతుందనే చెప్పాలి. అయితే ఇదే మొండి ధైర్యం ఇప్పుడు కమల్ హాసన్ ను చిక్కుల్లోకి నెట్టింది. ఈ మధ్య కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘హిందువులంతా మహాకావ్యంగా, ఎంతో పవిత్ర గ్రంథంగా భావించే మహాభారతంలో ఓ మహిళ ఎంతో అవమానానికి గురైంది. ఆ కావ్యంలో పాంచాలిని జూదంలో పావులా వాడుకున్నట్లు రాయబడింది. కానీ.. ఎందుకని ఇంకా మనదేశం మహాభారతాన్ని గౌరవిస్తూనే ఉంది... అలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు కమల్ హాసన్. కాగా కమల్ ఈ విధంగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక హిందూ సంఘాలు, సంద్రదాయవాదులు కమల్ వ్యాఖ్యలపై విరుచుకు పడుతున్నారు.
ఓ ప్రముఖ హిందూ సంస్థ అయిన హెచ్ఎంకే చెన్నై నగర పోలీస్ కమిషనర్ కు కమల్ పై అప్పుడే ఫిర్యాదు కూడా పెట్టింది. మహాభారతంపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా, అత్యంత హీనంగా కించపరిచేలా ఉన్నాయని వెల్లడించింది. కాగా హెచ్ఎంకే రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ స్పందిస్తూ... కమల్ హాసన్ లాంటి గొప్ప విలక్షణ నటుడు ఇలా దారుణంగా మాట్లాడటం ఎంతమాత్రం తగదని, అలాగే కమల్ కు హిందూమతంపై కాకుండా వేరే ఏమతం మీదనైనా ఇటువంటి వ్యాఖ్యలు చేసే దమ్ము ధైర్యం ఉందా అంటూ విమర్శించాడు. ఇంకా కమల్ వ్యాఖ్యలపై సర్వాత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా కోయంబత్తూర్ లో కమల్ హాసన్ పై కేసు కూడా నమోదైంది. ఇంకా చెన్నైలోని ఈరోడ్ లో కమల్ హాసన్ కు వ్యతిరేకంగా పలువురు హిందువులు, సంప్రదాయవాదులు తమ నిరసనను తెలిపారు.