దేశపాలకులు ఎవరైనా సరే దక్షిణాదిని సవతి తల్లిగా చూస్తున్నారని, తమకు పట్టున్న, ఎక్కువ ఎంపీ సీట్లున్న ఉత్తరాది ప్రేమనే చాటుకుంటున్నారని పవన్ ఆమధ్య చెప్పాడు. కానీ దీనిపై విమర్శలు వచ్చాయి. పవన్‌కి ఓనమాలు తెలియవని, స్వాతంత్య్రం వచ్చి ఇంతకాలం అయినా ఇంకా మన ఇండియా అని ఆలోచించకుండా, ఉత్తరాది, దక్షిణాది అని మాట్లాడటం రాజకీయ అవివేకమని మన కేంద్రమంత్రివర్యులు వెంకయ్య సెలవిచ్చారు. చంద్రబాబు గారు కూడా పవన్ వ్యాఖ్యలను కొట్టి వేశారు. కాగా సమైక్యాంథ్రని అడ్డగోలుగా విభజించి, 2014 ఎన్నికల్లో లబ్దిపొందాలని జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు చేతులు కలిపి విడదీశాయి. పోనీ అది తెలంగాణ వారి మనోగతానుసారం జరిగిందనే భావిస్తే, కొత్తగా ఏర్పాటైన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎన్నికల్లో రైతులకు రుణమాఫీని ప్రకటించాయి. అసలే కొత్తగా బాలారిష్టాలు ఎదుర్కొంటున్న ఈ రెండు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా లోటుబడ్జెట్‌తో నానా ఇబ్బందులు పడుతున్న ఏపీ ప్రభుత్వాలు రైతుల రుణమాఫీకి తమ చేతనైనంత సాయం చేయాలని కేంద్రాన్ని బతిమాలాయి. కనీసం రుణాలను రీషెడ్యూల్ అయినా చేయాలని కాళ్లావేళ్లా పడ్డాయి. కానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోదీ, వెంకయ్య తదితరులు రైతు రుణమాఫీ అనేది ఒక వృథాప్రక్రియ అని, ఇలా తాయిలాలు ఇవ్వడం ఆర్థిక క్రమశిక్షణ కాదని తెలిపారు.
అయినా టిడిపి ఎన్టీయేలో భాగస్వామి అయినంత మాత్రాన, ఒకే వేదిక పై నుంచి చంద్రబాబు, మోదీలు ప్రసగించినా సరే.. ఆ రుణమాఫీ టిడిపి ఇచ్చిందే గానీ దానికి బిజెపికి సంబంధంలేదని తేల్చిచెప్పారు. బిజెపి రైతు రుణమాఫీ వంటి ప్రజాకర్షక పథాకాలకు దూరమని సెలవిచ్చారు. కానీ మొన్నటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ పాల్గొన్న ప్రచారసభల్లో తమని గెలిపిస్తే యుపీలో రైతురుణమాఫీ చేస్తామని ప్రకటించాడు. దీనిపై ఆనాడు స్పందిస్తే, కేవలం బిజెపికి మాత్రమే దేశభక్తి ఉందని భావించిన చాలా మంది అది గెలుపు కోసం ఎవరైనా చెప్పే మాటలేనని, గెలిచినా కూడా మోదీ యుపీలో రైతు రుణమాఫీచేయడని వితండంగా వాదించారు. కానీ తాజాగా పార్లమెంట్‌లో కేంద్రమంత్రి మాట్లాడుతూ, యూపీలో రైతురుణమాఫీ ఉంటుందని.. ఆ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని సెలవిచ్చారు. బిజెపికి దక్షిణాదిలో కర్ణాటకలో తప్ప ఇంకే రాష్ట్రంలోనూ గెలిచేపట్టులేదు. తెలంగాణని టార్గెట్ చేసిన ప్రజలు టిఆర్‌ఎస్ వైపే మొగ్గుచూపారు. దాంతో దక్షిణాదిని మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పట్ల మోదీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమని చూపిస్తోందని పార్లమెంట్ సాక్షిగా రుజువైంది...!