అసలే మన ప్రజల మనోభావాలు ఎప్పుడు? ఎందుకు? దెబ్బతింటాయో అర్దం కావడం లేదు. ఇక ప్రభుత్వాల వైఖరి చూస్తుంటే వారి నియంతృత్వపోకడలు మితిమీరి ఒకప్పటి ఎమర్జెన్సీని మరిపిస్తున్నాయి. తమపై చిన్న విమర్శ చేసిన వారు తట్టుకోలేకపోతున్నారు. మీడియా స్వేఛ్చ అని మాట్లాడుతూనే వారి గొంతును నొక్కేస్తున్నారు. అమెరికాలో ట్రంప్‌ను సైతం ఆ దేశ మీడియా ఉతికి ఆరేస్తోంది. ఇక ట్రంప్ అయితే మీడియాపై మండిపడుతున్నాడు. అదే పరిస్థితి ఇండియాలో కూడా నెలకొని ఉండటం ప్రమాదకర సంకేతాలనిస్తోంది. ప్రభుత్వాలు కక్ష్య పూరిత చర్యలకు సెన్సార్‌ను వాడుకుంటున్నారు. బూతు సీన్లను, నగ్న దృశ్యాలను, ద్వందార్ధాలను సైతం అనుమతిస్తున్న సెన్సార్ వారు ప్రభుత్వ విధానాలపై చురకలు వేస్తే మాత్రం కట్ అంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ తాజాగా విడుదల కానున్న 'ఏటిఎం నాట్ వర్కింగ్' చిత్రమే. పలు సమస్యలను తన చిత్రాల ద్వారా చూపించి ఆ సమస్యల తీవ్రతను చూపించడంలో దర్శకనిర్మాత సునీల్‌కుమర్‌రెడ్డిది విభిన్నశైలి. 'గంగపుత్రులు నుంచి ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' వరకు ఆయన తీసిన చిత్రాలు ఆయనకు కమర్షియల్ విజయాలను ఇవ్వకపోయినా కూడా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో ఈ జర్నలిస్ట్ కమ్ డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఎందరి ప్రశంసలనో అందుకున్నారు.
స్వాతంత్యం వచ్చిన తర్వాత 50రోజుల పాటు దేశ ప్రజలందరినీ ఆకర్షించి, ప్రభావితం చేసిన అంశం నోట్ల రద్దు నిర్ణయం. బ్యాంకుల్లో డబ్బులు లేవు, ఏటీఎంలలో నాట్ వర్కింగ్ అనే బోర్డులు వేలాడుతున్నాయి, నోట్ల రద్దు ఎఫెక్ట్ దేశంలో ఇంకా అదే స్థాయిలో తీవ్ర ప్రభావం చూపుతూనే ఉంది. ఉద్దేశ్యం మంచిదే కావచ్చు. కానీ దానిని అమలు చేసిన విధానం, ప్రత్యామ్నాయాలు చూపించడం, తగిన ఫలితం లభించిందా? లేదా? అని పారదర్శకంగా చెప్పడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. కానీ ప్రజలు దీని వల్లనైనా ఎంతో కొంత మేలు జరుగుతుందేమోనని తమ బాధను ఎంతగానో ఓర్చుకున్నారు. ఇప్పటికీ సహనం చూపుతున్నారు. హింసాత్మక చర్యలకు దిగడం లేదు. ఇక ప్రధానులు, ముఖ్యమంత్రుల, మంత్రులే కాదు.... చివరకు చోటా చోటా నాయకులు, బస్తీ నాయకులు, కార్పొరేటర్లు కూడా బ్యాంకుల వద్ద , ఏటీఎంల వద్ద నిలుచుని నగదు డ్రా చేసుకున్న పరిస్థితి మనకు కనిపించదు. దీనిపై సునీల్‌కుమార్‌రెడ్డి సినిమా తీస్తే టైటిల్‌లో కూడా 'ఎటిఎం నాట్ వర్కింగ్' అనే పదం కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఉందని చెప్పి, నాట్ అనే పదాన్ని తొలగించారు. ఇక ఎన్నో వ్యంగ్యాస్త్రాలనే కాదు.. టైటిల్ కార్డ్స్‌లో వేసే ధన్యవాదాలు అనే చోట ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి కృతజ్ఞతాకార్డులు వేస్తే తొలగించారు. ఇదేమి న్యాయం.... ఇది నిజంగా ప్రజాస్వామ్యమేనా? సెన్సార్ విధానాలు ఎందుకు ఇలా ఉన్నాయి? అనే వాటికి సమాధానం దొరకడం లేదు.