ఈమధ్య మన స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌లు వరుసగా చిత్రాలు చేయడానికి రెడీ అవుతున్నారు. దీనికి 2019 ఎన్నికలకు లింక్ ఉందని, ఆలోపు వీలైనన్ని ఎక్కువ చిత్రాలలో నటించి కోట్లు సంపాదించి వాటిని వచ్చే ఎన్నికలలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతోనే వారు వరుస చిత్రాలు చేస్తున్నారనే విమర్శలు మొదలయ్యాయి. ఏడాదికి ఒకటి మాత్రమే తీస్తే ఇంత తక్కువగా తీస్తే ఎలా అని విమర్శిస్తారు. సినిమా పరిశ్రమ బతకాలంటే పెద్ద హీరోల చిత్రాలు కూడా వరుసగా ఉండాలని నీతులు చెబుతారు. ఎక్కువ చిత్రాలలో నటిస్తే డబ్బు మీద వ్యామోహంతోనే ఎక్కువ చిత్రాలలో నటిస్తున్నారని విమర్శిస్తున్నారు. మరి బన్నీ, ఎన్టీఆర్, మహేష్, నాగార్జున వంటి స్టార్స్ కూడా తమ సినిమాలు స్పీడును పెంచారు కదా...! కాబట్టి కేవలం చిరు, పవన్, బాలయ్యలను ఈ విషయంలో విమర్శించే ముందు ఆలోచించాలి. ఎక్కువ కష్టపడి, సినిమాలలో సంపాదించి, పన్నులు సక్రమంగా చెల్లించి, మిగిలినది వారి ఇష్టానుసారం ఖర్చుపెట్టుకునే హక్కు వారికి లేదా? కొందరు యాంటీ ఫ్యాన్స్, నోటికొచ్చింది మాట్లాడే రాజకీయనాయకులు చేస్తున్న విమర్శలలో ఏమైనా అర్ధముందా? ఇక ఇదే విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ కూడా స్పందించాడు. ఎన్ని చిత్రాలలో చేయాలనేది వారి వారి ఇష్టమని, గతంలో కూడా చిరంజీవి, బాలకృష్ణ వంటి వారు, అంతకు ముందు కృష్ణ వంటి వారు కూడా వరుస చిత్రాలు చేసేవారని ఆయన స్పందించాడు. ఇలాంటి దుష్ప్రచారాలను పక్కనపెట్టాలని ఆయన హితవు పలికారు.