ఇప్పుడిప్పుడే తెలుగు స్టార్స్ ఆలోచనా విధానం మారుతోంది. రజనీకాంత్, కమల్‌హాసన్, సూర్య... వీరిలా మనవారు కూడా బహుభాషా చిత్రాలపై కన్నేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ భాషల ప్రేక్షకులను సంపాదించుకొని తమ చిత్రాల స్థాయిని పెంచాలనుకుంటున్నారు. అలా చేస్తే తమ చిత్రాలపై పెట్టే భారీ బడ్జెట్‌ను ఈజీగా రికవరీ చేయగలగడమే కాదు.. బాహుబలి వంటి భారీ చిత్రాలను, రోబో, 2.0, విశ్వరూపం వంటి భారీ స్థాయి చిత్రాలను తాము చేయగలమని నమ్ముతున్నారు. నిన్నటివరకు ఇతరభాషలపై ఎక్కువగా కోలీవుడ్ హీరోలు ఫోకస్ పెట్టేవారు. ఇక ఎలాగూ బాలీవుడ్ హీరోలకు దేశవ్యాప్త గుర్తింపు ఉంటుంది కాబట్టి వారు సక్సెస్ అయ్యారు. ఇక బాలీవుడ్ హీరోలే తమ చిత్రాలను ప్రాంతీయ భాషల్లోకి కూడా అనువాదం చేయాలని తహతహలాడుతున్నారు. ఇలా చివరకు మన స్టార్స్ ఆలోచనా తీరులో కూడా మార్పు ఖచ్చితంగా కనిపిస్తోంది. మన కంటే కోలీవుడ్‌స్టార్స్, శంకర్, మురుగదాస్, మణిరత్నం వంటి దర్శకులే ఎక్కువగా ఆధిపత్యం చెలాయించేవారు. ఇప్పటికీ మనకు మద్రాసీలనే పేరు పోలేదు.
కానీ 'బాహుబలి'తో మన ఇండస్ట్రీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇక బన్నీ ఆల్‌రెడీ మాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే ప్రయత్నంలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు కూడా ఉన్నాడు. కోలీవుడ్‌ను, టాలీవుడ్‌ను ఒకేసారి టార్గెట్ చేసేందుకు, అవసరమైతే బాలీవుడ్‌ని కూడా ఆకర్షించే విధంగా దర్శకుడు మురుగదాస్‌తో చిత్రం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని మలయాళంలోకి కూడా డబ్బింగ్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఇక కన్నడలో ఎలాగూ డబ్ చేయడానికి వీలులేదు కాబట్టి, అక్కడ ఎలాగూ ఇతర దక్షిణాది భాషల్లో తెరకెక్కిన చిత్రాలను అదే భాషలో స్ట్రెయిట్‌గా రిలీజ్ చేస్తారు. దీంతో దాదాపు దక్షిణాదిని, హిందీతో ఉత్తరాదిని కలిపి తన సామ్రాజ్యాన్ని, ఇమేజ్, క్రేజ్‌లను పెంచుకోవడానికి మహేష్ రెడీ అవుతున్నాడు. మొదటగా ఈ ఆలోచన చేసింది అల్లు వారి మాస్టర్ మైండే అయినా దాన్ని వెంటనే ఆచరణలోకి తెస్తున్నది మాత్రం మహేష్ అనే చెప్పాలి.