అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయిన తర్వాత మరోలా, గెలిచినప్పుడు ఒకలా.. ఓడినప్పుడు మరోలా మాట్లాడటం మంచి పద్దతి కాడు. సాంకేతికంగా ప్రపంచం దూసుకుపోతోంది. బ్యాలెట్ కాగితాల స్థానంలో ఈవీఎంలు వచ్చాయి. కానీ గతంలో బిజెపి ఓడిపోయినప్పుడు ఈవీఎంల పనితీరుపై ఆ నాయకులు పలు అనుమానాలు లేవనెత్తారు. ఇక తాజాగా యూపీలో బిఎస్పీ ఓడిపోతే, పంజాబులో క్రేజీవాల్ అనుకున్న స్థాయిలో సీట్లు గెలుచుకోలేకపోయేసరికి ఈవీఎంల ట్యాంపరింగ్ వివాదాన్ని మరలా వీరు తెరపైకి తెచ్చారు. త్వరలో జరగనున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను వాడాలని క్రేజీవాల్ డిమాండ్ చేశారు. మరి బిజెపి ఈవీఎంల ట్యాంపరింగ్ చేసిఉంటే గత ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఎలా అధికారంలోకి రాగలిగింది? మరి పంజాబులో బిజెపి ఎందుకు ఓడిపోయింది? అనే విషయం క్రేజీవాల్ సైతం విస్మరిస్తున్నాడు. ఒకప్పుడు ఇలాంటి ఆరోపణలే చేసిన బిజెపి నాయకులు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబు ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో ఓ కార్యక్రమం పెట్టి మరీ వివరించాడు. మరి అదే నిజమైతే 2014లో తెలుగుదేశం పార్టీ ఎలా గెలిచింది? ఇప్పుడు ఈవీఎంల గురించి బాబు ఎందుకు మాట్లాడటం లేదు? రేపు మరలా ఓడిపోతే ఆయన మరలా ఇదే వాదన లేవనెత్తడం ఖాయం.
ప్రజా తీర్పును ఇలా అపహాస్యం చేసేవారిని ఏమనాలి? దీనికి బిజెపి, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ, బిఎస్పీ, టిడిపి, వైసీపీ.. ఇలా అందరూ దొంగలే అనిపిస్తున్నారు. సామాన్యులను బఫూన్లను చేస్తున్నారు. ఒకప్పుడు ఆధార్‌కార్డులను తప్పుపట్టిన బిజెపి నాయకులు ఇప్పుడు ఆధార్‌ను ప్రతి విషయానికి వర్తింపజేస్తున్నారు. ఒకప్పుడు ఆధార్ వ్యవస్థను తప్పుపట్టిన బాబు ఇప్పుడు ఆధార్ సాయంతో నగదు రహిత లావాదేవీలు ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. ఆధునికతను,సాంకేతిక విప్లవాలను గమనించి, మరింత ముందుకు పోకుండా పాత విధానాల కోసం మరలా అర్రులు చాచి తిరోగమనంలో పయనించడం సమంజసమేనా...!