సినీ పరిశ్రమ మద్రాస్‌లో ఉన్నంతకాలం తెలుగు ప్రేక్షకులకు సినిమా అనేది ఓ బ్రహ్మపదార్దం. సినిమా హీరోలు నిజజీవితంలో ఎలా ఉంటారు? సినిమాలు ఎలా తీస్తారు? వారిని జీవితకాలంలో ఒక్కసారైనా కలవగలమా? అని కలల్లో బతికేవారు. నాటి సినిమాలను కూడా ఎక్కువగా ఔట్‌డోర్‌లో తీయకుండా స్టూడియోలలోనే తీసేవారు. కానీ పరిశ్రమ హైదరాబాద్‌కి షిఫ్ట్‌కావడం, షూటింగ్‌లు, ఆడియో వేడుకలు, శతదినోత్సవ వేడుకలు వంటివి బయటి ప్రాంతాలలో కూడా జరుపుతుండటంతో సినిమా అనేది నేడు అరచేతిలోకొచ్చేసింది. ఇక కోలీవుడ్ హీరోల విషయానికి వస్తే ఆయా హీరోలకు ఆయారాష్ట్రాలలో భారీ ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి స్టోరీ డిమాండ్ చేసినా కూడా ఆయా రాష్ట్రాలలో అక్కడి స్టార్స్ షూటింగ్ జరిగితే జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. దీంతో రజనీ, సూర్య వంటి హీరోలు తమ చిత్రాలను చెన్నై బదులు వైజాగ్‌లో, హైదరాబాద్‌లో కూడా చిత్రీకరించడం మొదలుపెట్టారు.
ఇక రామోజీ ఫిలింసిటీ వంటివి ఉండటంతో బాలీవుడ్ చిత్రాలను కూడా హైదరాబాద్‌లో తీయడం మామూలైపోయింది. కానీ నిన్నమొన్నటివరకు మన తెలుగుస్టార్స్‌కి మిగిలిన భాషల్లో పెద్దగా గుర్తింపులేదు. దీంతో మన స్టార్స్ చిత్రాలను ఎక్కడ తీసినా పెద్దగా ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ నేడు పెరిగిన సాంకేతికత, మన హీరోలు ఇమేజ్, తెలుగు వారు దేశ విదేశాలలో అన్ని చోట్లా విస్తరించడంతో మన స్టార్స్‌కి కూడా బహిరంగ ప్రదేశాలలో షూటింగ్ చేస్తే జనాల తాకిడి తప్పడం లేదు. పవన్, మహేష్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, చరణ్ వంటి హీరోల చిత్రాలను చెన్నై, పొలాచ్చి, పూణె, ముంబై, అహ్మదాబాద్ నుంచి అబుదాబిలో తీస్తున్నా కూడా ఇక్కడ అభిమానులు అంత దూరం వెళ్లి నానా హడావుడి చేస్తున్నారు. ఇక విదేశాలలోనూ ఇదే పరిస్థితి. ఇక పవన్ నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్రాన్ని ఓ గ్రామంలో తీయాల్సిన పరిస్థితి ఉంది. దూరంగా వెళ్లాలంటే పవన్ ఉన్న బిజీ రీత్యా ఇబ్బంది. అలాగని హైదరాబాద్‌తో పాటు తక్కువ దూరంలోని గ్రామాలలో తీస్తే ఇబ్బందులు తప్పవు. అందుకే ఈ చిత్రం కోసం ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి ఓ గ్రామం సెట్‌ను చాలా తక్కువ టైమ్ లో వేయగా, అందులో షూటింగ్ చేశారట. ఇలాంటివి వింటున్నప్పుడు మన స్టార్స్‌కి కూడా నేడున్న క్రేజ్‌ను చూస్తే ఆనందం వేస్తుంది.