ఇంతకాలం వైయస్సార్‌సీపీ అధినేత జగన్, జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌లకు ప్రత్యేకహోదా అనే విషయం ఓ అస్త్రంగా మారిందనేది వాస్తవం. కానీ తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసి, ఫలితాలు కూడా వచ్చిన దరమిలా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసి చట్టబద్దత కల్పించింది. దీంతో ఇది టిడిపి, బిజెపిలకు అదనపు ధైర్యాన్ని ఇవ్వనుంది. అదే సమయంలో ప్రత్యేకహోదాపై ఇంకా ఎక్కువగా మాట్లాడి, ఉద్యమాలు చేస్తే అది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మేలు చేయదని, కాబట్టి అది గతించిపోయిన వ్యవహారంగా టిడిపి, బిజెపిలు ప్రచారం చేస్తాయి. కేంద్రంతో సర్దుకుపోవడమే పరిష్కారం అని టిడిపి కూడా ప్రజల ముందుకు వెళ్తుంది. ఈ సమయంలో ఇంకా ప్రత్యేకహోదా విషయంలో రాద్దాంతం చేయకుండా, ప్రజలందరికీ హోదా, ప్యాకేజీల మద్య తేడాను స్పష్టంగా చెప్పగలిగితేనే పవన్, జగన్‌లను ప్రజలు ఆదరిస్తారు. కాదు.. ప్రత్యేకహోదా వల్ల చాలా ప్రయోజనాలుంటాయని చెబూతూ పోతే అవి ప్రతికూలాంశాలుగా మారే ప్రమాదం ఉంది.
మొత్తానికి మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మోదీ పట్ల ప్రజల్లో ఇంకా విశ్వాసం సడలలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి టిడిపిని, చంద్రబాబును టార్గెట్ చేసేందుకు పవన్, జగన్‌లు ఇతర అస్త్రాలను సిద్దం చేసుకోవడమే మార్గమని, ఇంకా ప్రత్యేకహోదా విషయంపై రాద్దాంతం చేయడం ప్రయోజనం కలిగించదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక త్వరలో అంటే వచ్చే ఎన్నికల నాటికి పోలవరం పనులను దాదాపు పూర్తిచేసి, విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ ఇచ్చే ఉద్దేశ్యం కేంద్రంలో కనిపిస్తోంది. ముందుగా ఇస్తే దాంతో ఎలాంటి ఫలితం ఉండదని, వచ్చే ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఒక్కో హామీని ఇవ్వడం ద్వారా ఎన్నికల్లో లబ్దిపొందాలనేది బిజెపి, టిడిపిల ఎత్తుగడలా కనిపిస్తోంది.