జనసేన పార్టీ మూడో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ ప్రసంగించిన విధానం చాలా బాగుంది. కానీ అది చప్పగా సాగిందని, పట్టులేదనే విమర్శలురావడం కూడా సహజమే. కానీ పవన్ భావాలు సగటు ఓటరును ఆకట్టుకున్నాయి. ప్రజారాజ్యం పార్టీలో జరిగిన తప్పులు, వాటిని తిరిగి పునరావృతం కాకుండా చూసుకుంటానని పవన్ బహిరంగంగా చెప్పడం.. తనతో తన అన్నయ్య చిరు నడిచేది లేదని తేల్చిచెప్పడం, తమ ఇద్దరి భావాలు, మనస్తత్వాలు వేర్వేరని తెలపడం హర్షించదగిన విషయం. ఇలాంటి పారదర్శకతతో కూడిన, నిజాన్ని, తాను నమ్మిన సిద్దాంతాలను కుండబద్దలు కొట్టగల పవన్ వ్యక్తిత్వమే ఇప్పటికీ ఎందరినో ఆకట్టుకుంటోంది. ఇప్పటి నుంచే తన పార్టీ పటిష్టత, కార్యాచరణ, వచ్చే 2019 నాటికి ఎన్నికలకు సంసిద్దం కావాలని ఆయన నిర్ణయించుకోవడం ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. కాగా ఎన్డీయేలో తాను భాగస్వామిని కానని చెప్పి ఆయన బిజెపి ఏపీకి చేసిన మోసాన్ని మరోసారి ప్రస్తావించారు. మరోవైపు చంద్రబాబు విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాడు. చంద్రబాబు విషయంలో ఆయన మెతకవైఖరి తీసుకోవడం కొందరికి అస్త్రంగా మారుతోంది. గత ఎన్నికల్లో టిడిపిని, బిజెపిని బలపర్చి, బహిరంగంగా వారికి మద్దుత్తు తెలిపి, వారి విజయానికి దోహదం చేసిన పవన్ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు పరోక్షంగా ఉపకరిస్తాడేమో? అనే విమర్శలకు ఇది అవకాశం ఇచ్చింది.
చంద్రబాబు వైఫల్యాలను పవన్ పెద్దగా టార్గెట్ చేయలేదు. ఇక మణిపూర్ ఎన్నికల్లో ఉక్కుమహిళ ఇరోం షర్మిల ఘోరపరాజయాన్ని, ఆమెకు వచ్చిన ఓట్లు చూసినవారికి అసలు ప్రజలు మంచివారిని ఎంచుకుంటారా? లేక కులం, మతం, ప్రాంతీయ తత్వం, అవినీతి, డబ్బు వంటి ప్రలోభాలకు మాత్రమే లొంగుతారా? అనే ఆలోచనను రేకెత్తించింది. గతంలో అన్నాహజారే నుంచి మేథాపాట్కర్ వరకు, తెలుగు రాష్ట్రాలలో లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ్ వరకు ఎంతో మంది మేథావులు, అవినీతి, కుల రహిత సమాజాన్ని కోరుకున్న ఉద్యమకారులు ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కానీ కేజ్రీవాల్ ఆమ్‌ఆద్మీ పార్టీ మాత్రం అనుకున్న దానికన్నా మెరుగైన ఫలితాలను రాబడుతోంది. ఢిల్లీలోనే కాదు.. పంజాబ్‌లో సైతం ఆ పార్టీకి అనుకున్న స్థానాలు రాకపోయినప్పటికీ ఆ రాష్ట్రంలో కేజ్రీవాల్ తన పార్టీని రేసులోకి దించి మంచి ప్రభావమే చూపించాడు. వీరందరికీ లేని ఒకే ఒక్క ప్లస్ పాయింట్ పవన్‌కి ఉంది. పవన్ స్టార్‌హీరో కావడం వల్ల ఆయనకు మంచి క్రేజ్, ఇమేజ్, బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వంటివి ఆయనకున్న ప్లస్ పాయింట్స్. మొత్తానికి అధికారమే పరమావధి కానప్పటికీ అధికారం దక్కకుండా ఉంటే ఎన్నో ఉద్యమాలు, మార్పులు సాధించడం సులువు కాదనే విషయాన్ని పవన్ జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.