రేపు అంటే 16వ తేదీన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'బాహుబలి-దికన్‌క్లూజన్' చిత్రం ట్రైలర్ విడుదల కానుంది. 'బాహుబలి-ది బిగినింగ్' సాధించిన ఘన విజయం నేపథ్యంలో రెండో పార్ట్‌ను రాజమౌళి మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కాగా గత కొన్నిరోజులుగా సినిమా పోస్టర్స్‌ని రిలీజ్ చేస్తు అందరినీ ఆకట్టుకుంటున్న జక్కన్న రేపు విడుదల చేయబోయే ట్రైలర్ ఎలా ఉండనుంది? అనే విషయంలో భారీ అంచనాలున్నాయి. ఇక 'బాహుబలి-ది బిగినింగ్' ద్వారా 500కోట్లకు పైగా కొల్లగొట్టిన ఈ చిత్రం సెకండ్‌పార్ట్ దేశవ్యాప్తంగా ఎంత ప్రీరిలీజ్ బిజినెస్ చేయనుంది? థియేటికల్ రైట్స్ ఎంత వసూలు చేయనుంది? ఇక కలెక్షన్ల రూపంతో పాటు ఇతర మొత్తాలన్నీ కలిపి దాదాపు 1000కోట్ల మొత్తాన్ని అందుకోవాలని చూస్తున్న ఈ చిత్రానికి ఆ స్థాయిలో భారీ అంచనాలు పెంచడంలో ఈ ట్రైలర్ ఏ మేరకు తన పాత్రను పోషిస్తుంది? అనేది వేచిచూడాల్సివుంది. ఇక ఈ చిత్రం ట్రైలర్ 2 నిమిషాలా 20 సెకండ్లు ఉందంటున్నారు. ఈ ట్రైలర్‌కు సెన్సార్‌బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్‌ని ఇచ్చిందని సమాచారం.
మరోపక్క ఈ చిత్రంపై రాజమౌళినే కాదు ప్రభాస్, రానా వంటివారు కూడా భారీ ఆశలే పెట్టుకుని ఉన్నారు. విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను అద్భుతంగా చూపించి, సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే భారీ అంచనాలను జక్కన్న పెంచుతాడా? అసలు టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ చిత్రానికి మరింత హైప్ అవసరమా? ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా ఈ చిత్రాన్ని ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు తప్పక చూస్తారని అందరూ భావిస్తున్నారు. మరి మిగిలిన భాషల్లో కావాల్సిన అంచనాలు తెలుగులో మాత్రం ఈ చిత్రానికి పూర్తిగా అనవసరమేనని చెప్పాలి. మరి తెలివిగా తన చిత్రాలను భారీగా తీసినా కూడా మార్కెటింగ్ చేసుకోగలిగిన రాజమౌళి ఏం చేయబోతున్నాడో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు రెండు తెలుగు రాష్ట్రాలలోని ఎంపిక చేసిన 200 థియేటర్లలో ఈ చిత్రం ట్రైలర్‌ని ప్రదర్శించి, సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే సెంటిమెంట్ మొదటి పార్ట్‌కి బాగానే కలిసొచ్చింది. మరి రేపు ఏం జరగనుందో చూడాలి...?