తెలుగు పరిశ్రమ అనేది కొత్త హీరోయిన్లకు అక్షయపాత్ర వంటిది. ఎంతమంది వచ్చినా అక్కున చేర్చుకుంటుంది. కొత్తదనం కోసం.. కొత్త అందాల కోసం అర్రులు చాచే మన మేకర్స్ అభిరుచికి తగ్గట్టుగా హీరోయిన్లు కూడా రోజుకో కొత్త అందంతో హవా నడుపుతున్నారు. ఇటీవలి కాలంలో కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్ వంటి వారెందరో ఇక్కడ తమ సత్తా చాటుతున్నారు. కాగా ప్రస్తుతం మరో భామ మన మేకర్స్‌ని, హీరోలను బాగా ఆకర్షిస్తోంది. అమే కన్నడ భామ రష్మిక మండన్న. 'కిరాక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా ఈమె వెండితెరకు పరిచయమై సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఆమె పునీత్‌రాజ్‌కుమార్, దర్శన్, గణేష్ వంటి స్టార్స్‌లో జోడీ కడుతోంది. కాగా ఇప్పటికే ఈ అమ్మడిని తెలుగు తెరకు పరిచయం చేయాలని కొందరు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. హీరో నాగశౌర్య తానే హీరోగా, నిర్మాతగా చేసే చిత్రంలో ఈ భామకు అవకాశం ఇచ్చాడని తెలుస్తోంది. ఇక కొత్త అమ్మాయిలను పరిచయం చేసి, స్టార్ హీరోయిన్లుగా మార్చే జెంటిల్‌మేన్ నాని కూడా ఈ రష్మిక మండన్నతో నటించే అవకాశాలున్నాయి. మరోపక్క 'నేను.. శైలజ' చిత్రంతో కీర్తిసురేష్ అనే టాప్ హీరోయిన్‌ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరో రామ్, దర్శకుడు కిషోర్ తిరుమలల కాంబినేషన్‌లో రూపొందే చిత్రంలో కూడా ఈ అమ్మాయికి చాన్స్ ఇవ్వనున్నారట. మొత్తానికి త్వరలో మరో కన్నడ భామ తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి, సౌందర్య లెవల్లో అలరించడం ఖాయమని కొందరు ఇప్పటి నుంచే ఘంటాపథంగా చెబుతున్నారు.