క్లాస్ కమెడియన్‌గా మెప్పించి, సపోర్టింగ్ రోల్స్‌తో ఇప్పుడు హీరోగా ఎదిగిన నటుడు అవసరాల శ్రీనివాస్. కాగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన 'ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద'లతో దర్శకునిగా కూడా తన అభిరుచిని చాటుకున్నాడు. రాత్రికి రాత్రే కాకపోయినా చివరకు అందరికీ తన అవసరం ఉందనే విధంగా ఎదుగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన 'బాబు బాగా బిజీ' చిత్రంలో నటిస్తున్నాడు. అడల్డ్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన 'హంటర్'కు రీమేక్. నవీన్ మేడారం దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈమద్య టాలీవుడ్‌లో అడల్ట్ కంటెంట్ చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ప్రతి ఒక్కరికి సెల్‌ఫోన్, ఇంటర్నెట్ లభిస్తున్న ఈ రోజుల్లో అడల్డ్ చిత్రాలకు ఆదరణ తగ్గడం సాధారణమే. మారుతి వంటి వారు 'ఈ రోజుల్లో, బస్టాప్' వంటి చిత్రాలతో మెప్పించినా పూర్వ వైభవం మాత్రం తేలేకపోయారు. దాంతో ఆ జోనర్ ఆడియన్స్‌ని 'బాబు బాగా బిజీ' టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అవసరాల సరసన మిస్తీ చక్రవర్తి, శ్రీముఖి, సుప్రియ, తేజస్విని తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక అవసరాల హీరోగా అడవి శేషు, వెన్నెల కిషోర్‌లతో కలిసి 'అష్టాచెమ్మా, జెంటిల్‌మేన్' చిత్రాలతో దర్శకునిగా సత్తా చాటిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'అమీ తుమీ' చేస్తున్నాడు. దర్శకునిగా త్వరలో నాని హీరోగా ఓ చిత్రాన్ని చేయనున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మించవచ్చు. మొత్తానికి శ్రీని అవసరాల మాత్రం బాగా బిజీగా ఉన్నాడనే చెప్పాలి.