దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాలు అనూహ్యంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా జయలలిత మేనకోడలు దీప ఆర్కేనగర్ నుండి జరిగే ఉప ఎన్నికకు తాను పోటీలో దిగుతానని ప్రకటించిన తర్వాత నుండి ఆమె శశికళ వర్గం నుండి ప్రతిఘటన ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి అధికార పార్టీపై విరుచుకు పడుతున్న కమల్ హాసన్ పై కూడా ఆ పార్టీనాయకులు రెచ్చిపోవడం జరిగింది. జయలలిత మృతి తర్వాత తమిళ సినీ పరిశ్రమ నుండి ఎక్కువగా ఫోకస్ అయిన నటుడు కమల్ హాసన్ అనే చెప్పాలి. ఈ విశ్వనటుడు జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా... పన్నీర్ సెల్వమ్ కు బహిరంగ మద్దతు తెలిపాడు. అంతటితో ఆగకుండా శశికళ మీద సెటైర్లు లాంటివి కూడా వేసి కమల్ హాసన్ సంచలనం సృష్టించాడు. ఇంతచేసినా అధికార పార్టీ కమల్ హాసన్ పై ఇంతవరకు ఏమీ మాట్లాడకుండా గంభీరంగా ఉండిపోయింది.
అయితే తాజాగా కమల్ హాసన్.. తమిళనాడు రాష్ట్రంలో త్వరలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ కామెంట్ చేయడంతో అన్నాడీఎంకే ప్రతినిధులు తీవ్రంగా స్పందిస్తున్నారు. కమల్ హాసన్ పై ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. 'కమల్ ఓ నటుడు మాత్రమే.. తన కలలన్నీ కేవలం సినిమాలకే పరిమితం' అంటూ వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. ఇక ఈ మధ్య ఏకంగా కమల్ హాసన్ వేరే సొంత పార్టీ పెడుతున్నారని టాక్ నడుస్తుండటంతో.. అన్నాడీయంకే అధికార ప్రతినిధి వైగై చెల్వన్.. కమల్ హాసన్ పై తీవ్రంగా విరుచుకు పడ్డాడు. కమల్ హాసన్ ను ఇక ఏమాత్రం ఉపేక్షించవద్దంటూ శశికళ నుంచి ఆదేశాలు వచ్చినందువల్లనే కమల్ పై మూకుమ్మడిగా అవాకులు చవాకులు పేలుస్తున్నారని తెలుస్తుంది. కాగా ఏప్రిల్ 12వ తేదీన జరగనున్న ఆర్కే నగర్ ఉపఎన్నికలకు కమల్ హాసన్ ప్రచారం చేయనున్నాడని కూడా తెలుస్తుంది. దీంతో తమిళనాడు రాజకీయాలు మళ్ళీ వేడెక్కడం ఖాయమేనన్నట్లు కూడా అర్థమౌతున్న అంశం.