అసలు ఊహించనైనా లేదు పూరి కి బాలకృష్ణ కి సెట్ అవుతుందని.... అసలు వీరి కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుందని... కానీ అనూహ్యంగా వీరి కాంబినేషన్ తెర మీదకి రావడం అది కాస్తా పూజా కార్యక్రమాలతో మొదలైపోవడము జరిగిపోయాయి. ఇక వీరి కాంబినేషన్ అని ఎప్పుడైతే సోషల్ మీడియాలో ప్రచారం మొదలైందో.. అప్పటినుండి ఈ చిత్రంపై అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఒకసారి చిరుకి చెప్పిన ఆటోజానీ కథతోనే బాలకృష్ణ చిత్రాన్ని పూరి తెరకెక్కిస్తున్నాడని.... మరొకసారి బాలయ్య కి కొత్త హీరోయిన్స్ ని పూరి సెట్ చేస్తున్నాడని... ఇంకోసారి బాలకృష్ణ చిత్రంలో కుర్ర హీరో సుధీర్ బాబు విలన్ గా నటిస్తున్నాడని అబ్బో చాలానే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఇందులో ముఖ్యం గా చెప్పుకోవాల్సింది ఏమిటంటే చిరు కి చెప్పిన ఆటోజానీ కథతోనే బాలకృష్ణ చిత్రాన్ని పూరి తీస్తున్నాడనేది బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇక బాలకృష్ణ అభిమానులైతే బాలయ్య 101 వ చిత్రాన్ని పూరి ఎలా తెరకెక్కిస్తాడో అని టెంక్షన్ తో ఎదురు చూస్తున్నారు. అందులోను చిరు ఆటోజానీ కథే బాలయ్య కొత్త చిత్రం కథ అని ప్రచారం జరగడంతో వారి ఆందోళన మరింత ఏక్కువైంది. అయితే చిరంజీవి కి చెప్పిన ఆటోజానీ కథతో పూరి ఈ చిత్రం చెయ్యడం లేదని హాలీవుడ్ మూవీ జాన్ విక్ ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రం తీయబోతున్నాడని తాజా వార్త ప్రచారంలోకి వచ్చింది.
రిటైరైన ఓ అధికారిని సంఘ విద్రోహ శక్తులు ఎలా దోచుకున్నదీ, మరి దోచుకున్నవారి మీద తిరిగి ఆ అధికారి ఎలా పగ తీర్చుకున్నాడన్నదీ ఈ చిత్ర కథ అని ప్రచారం మొదలైంది. ఇక ఆ అధికారి రోల్ కి బాలకృష్ణ సరిగ్గా సరిపోతాడని డైరెక్టర్ పూరి భావించాడట. ఆ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగినట్టు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తారని అంటున్నారు. మరి బాలయ్య - పూరి కాంబినేషన్ చిత్రంపై ఇన్ని వార్తలు ప్రచారం జరుగుతుండగా తాజాగా ఈ వార్త కూడా వాటిల్లో చేరిపోయింది.