నిరంతరం ట్విట్టర్ ద్వారా చెలరేగిపోతూ.. తనకు ఏదనిపిస్తే అది పోస్ట్ చేస్తూ... అలా దూసుకుపోతున్న దర్శకవీరుడు రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ గొప్ప మేధావే కాదని ఎవరూ అనరు. మంచి దార్శనికుడే అందులో సందేహం లేదు. వర్మ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో లోతైన ఆలోచన చేస్తూ అలా దివిటీలా వెలిగిపోతుంటాడు. ఆ సమయంలో ఓ ఆటవిడుపులా అప్పుడప్పుడూ పోటెత్తిపోతున్న సమాజం పాట్లను, అందులోని వింతలనూ, విడ్డూరమైన అంశాలను, వికృతమని తనకు అనిపించిన విషయాలను వర్మ చాలా పలచబారుతనంతో కామెంట్లు గుప్పిస్తుంటాడు. ఆ సమయంలో ఆయనకున్న లోతైనతాటు కారణంగా అలా అనిపించవచ్చునేమోగానీ, నిజంగా తరచి తరచి చూస్తే అసలు ఉచితానుచిత జ్ఞానాన్ని మరచి వివేకహీనుడి వలే భలే జోక్ లా ఎంతటి విషయాన్నైనా డైల్యూట్ చేసేలా ట్వీటటం సమాజం అంగీకరించని వైనం. అందుకే సామాజికులకు వర్మకు నిరంతరం వైరం జరుగుతూ ఉంటుంది.
కానీ ఇందులో మేధోవంతమైన ఒక ఆలోచన ఉంది. సమాజం గురించి ఆలోచించే వాళ్ళను సమాజం ఎప్పటికీ అర్థం చేసుకోదు అని. ఆ రకంగా రామ్ గోపాల్ వర్మ ను మనం తీసుకుంటే ఏదో ఒక దార్శనికుడుగా ప్రత్యక్షంగా చూస్తున్న సమాజం పట్ల ప్రజల వైఖరి, నాయకుల ధోరణుల పట్ల ఆయన ఆలోచన విధానం అలా ఉంది అనుకోవాలి. కానీ ఇప్పుడు విషయం ఏం జరిగిందంటే... శ్రీరాముడి కంటే మోడీనే గొప్ప దేవుడు అంటూ రామ్‌గోపాల్ వర్మ ట్వీటి కొత్త ఆలోచన విధానానికి దారితీశాడు. కాదు.. కాదు... వివాదానికి తెరదీశాడు. ఈ బాణం రామభక్తజన సందోహాన్ని జీర్ణించుకోలేని, నిద్రపోనివ్వకుండా నిరంతరం వారి మెదళ్ళను తొలిచి వేసేది. రామ భక్తులకు నషాలానికంటే కామెంట్. ఇటువంటి వర్మ వ్యాఖ్యతో రామభక్తులు ఆగ్రహిస్తే వర్మ భస్మమైపోతాడంటున్నారు విమర్శకులు. అసలు వర్మకి ఈ ఆలోచన ఎందుకొచ్చిందో చూద్దాం.
తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో మోడీ హవా బీభత్సంగా కొనసాగిన విషయం తెలిసిందే. దానికి వర్మ కనెక్టయిపోయి ఈ కామెంట్ చేశాడు. రెండు అతిపెద్ద రాష్ట్రాల్లో మోడీ హవా ఉండటం కారణంగానే భాజపా ప్రభంజనం సృష్టించింది. దీంతో వర్మ తనదైన శైలిలో ట్విట్టర్‌లో చెలరేగిపోయాడు. 'నరేంద్ర మోడి, శ్రీరాముడు కంటే చాలా గొప్ప దేవుడు, ఎందుకంటే నేను రాముని కాలంలో జీవించలేదు. ప్రస్తుతం మోడీ కాలంలో అయోధ్యలో నివసించేందుకు ఇష్టపడతాను' అంటూ ట్వీటాడు వర్మ. అంటే రాముడి కంటే మోడీ గొప్పవాడనే కదా. చూద్దాం మరి ఇప్పుడు హిందువులంతా వర్మను ఎలా అనుసరిస్తారో..?