భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ తో పాటు మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దాదాపు ఖరారయినట్లే తెలుస్తుంది. ఇందులో భాజపా మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడమే కాకుండా భారీ స్థాయిలో మెజారిటీని సాధించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ బీటలు బద్ధలయ్యేలా ఏకంగా 324 సీట్లు కైవశం చేసుకుని భాజపా సత్తా చాటుతుంది. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లో కూడా భాజపా హవా చాటింది. ఒక్క పంజాబ్‌లోనే కాంగ్రెస్ విజయం సాధించింది. మణిపూర్, గోవా రాష్ట్రాలలో కాంగ్రెస్ తో పోటా పోటీ సీట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది భాజపా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుకు అఖిలేష్ కు దిమ్మతిరిగేలా తీవ్ర అవమానం జరిగినట్లే. మొత్తానికి ఈ ఫలితాలు మొన్న వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్ పల్స్ ఏమాత్రం రాంగ్ కాదని తెలుస్తుంది. ఒక అతిపెద్ద రాష్ట్రాన్ని పూర్తి మెజారిటీతో కైవశం చేసుకోవడంతోపాటు, ఉత్తరాఖండ్ కంచుకోట తమదేనని నిరూపించిన భాజపా మరో రెండు రాష్ట్రాలైన గోవా, మణిపూర్ లో కూడా భాజపా గట్టి పోటీనిచ్చింది.
అయితే ఈ సందర్బంగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ.. మోడీ తీసుకున్న డీమానిటైజేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది నాయకులు, ప్రముఖులు తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టారని, మోడీ నిర్ణయం ఏమాత్రం రాంగ్ కాదు సరైనదేనని ప్రజలు గూబగుయ్యమనేలా చెప్పారని వివరించాడు. ఈ ఎన్నికల ఫలితాలతో నరేంద్ర మోదీ తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం డీమానిటైజేషన్ ఏవిదంగానూ రాంగ్ కాదని ప్రజలు బల్లగుద్ది చెప్పినట్లయిందని అమిత్ షా వెల్లడించాడు. నోట్ల రద్దు ప్రభావం ఎన్నికల్లో ఏమాత్రం లేదని, అది తమకు పాజిటివ్ బలాన్నిచ్చిందని ఆయన తెలిపాడు. ఎన్నికలకు ముందు కొంతమంది రాజకీయ విశ్లేషకులు రాబోవు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా గెలిస్తే పెద్దనోట్ల రద్దు నిర్ణయం సరైనదేనని, అలా కాకుండా భాజపా ఓడితే మోడీ తీసుకున్న నిర్ణయం తప్పని అన్నారు. అయితే ఇప్పుడు వారే మోడీ నిర్ణయం సరైనదేనంటూ వ్యాఖ్యానించడం విశేషం. కాగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడి ట్వీట్స్ ద్వారా స్పందించాడు. తాను ప్రతిక్షణం దేశ ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసమే తపిస్తున్నానని, భాజపాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళాలని భావించి శ్రమించిన ప్రతి కార్యకర్తకు తాను సెల్యూట్ చేస్తున్నానంటూ ప్రకటించాడు. ఆ సందర్భంగా భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా ప్రజాస్వామ్యం వర్థిల్లాలి అంటూ ట్వీట్ చేశాడు. మొత్తానికి మోడీ దేశంలోనే శక్తిమంతమైన లీడర్ గా పేరు తెచ్చుకున్నాడన్న మాట.