చిరు కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' కొణిదెల ప్రొడక్షన్ లో తెరకెక్కి కోట్లు కొల్లగొట్టేసింది. చిరంజీవి స్టామినాకి ఉన్న పవర్ ఏమిటో టాలీవుడ్ కి తెలుసు. కానీ తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ అంతటి క్రేజ్ ఉంటుందా... అని టాలీవుడ్ ప్రియులు ఆలోచించే లోపలే కలెక్షన్స్ వర్షం కురిపించి తనలో ఇంకా సత్తా ఉందని రుజువు చేసాడు చిరు. ఒక్క చిత్రం ప్రొడ్యూస్ చేసేసరికి రామ్ చరణ్ కి కోట్లు వర్షం కురిపించింది ఖైదీ... చిత్రం. అంతటితో కుమ్ముడు ఆపలేదు 'ఖైదీ...' చిత్రం ఇప్పుడు శాటిలైట్స్ రూపంలో కూడా చిరు స్టామినాని మరోసారి పరిచయం చేసింది.
దాదాపు 160 కోట్ల వసూళ్లు సాధించి టాలీవుడ్ లో రెండో తెలుగు భారీ సినిమాగా చరిత్ర సృష్టించిన ఈ మూవీ శాటిలైట్ హక్కులను 'స్టార్ మా' పన్నెండు కోట్లకు అమ్ముడుపోయాయని సమాచారం. మరి ఈ శాటిలైట్ హక్కుల విషయంలోనూ రికార్డులను సృష్టించిన ఖైదీ... చిత్రం ఇప్పటికే రామ్ చరణ్ కి దాదాపు 50 కోట్ల లాభాన్ని తెచ్చినట్లు చెబుతున్నారు. మరి 50 అంటే మాటలు కాదు... అందుకే తన తండ్రి తదుపరి చిత్రంపై ఇప్పుడు చరణ్ స్ట్రాంగ్ ఫోకస్ పెట్టాడని అంటున్నారు. ఇక ఆ చిత్రానికి ఎన్ని కోట్లు దాచుకుంటాడో రామ్ చరణ్ అని అంటున్నారు.