తమిళనాడు రాష్ట్రంలో డ్యాన్సర్ గా జీవితాన్ని ప్రారంభించిన రాఘవ లారెన్స్ ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా అంచలంచలుగా ఎదిగి హీరోగా మారిన విషయం తెలిసిందే. అయితే రాఘవ కెరీర్ ని డవలప్ చేసుకున్న విధానంలోని ప్రతి అడుగులోనూ తన కష్టం దాగి ఉంటుంది. కాగా తాజాగా రాఘవ లారెన్స్ ‘మొట్ట శివ.. కెట్ట శివ’ చిత్రాన్ని విడుదల చేశాడు. అయితే ఈ చిత్రం కళ్యాణ్ రామ్ తీసిన పటాస్ చిత్రానికి ఇది తమిళ రీమేక్. ఈ చిత్రం టైటిల్స్ లో ఈయన మక్కల్ సూపర్ స్టార్(పబ్లిక్ సూపర్ స్టార్) రాఘవ లారెన్స్ అని నేమ్ కార్డ్ వేసుకున్నాడు. అయితే ఈ విషయంపై స్పందించిన రాఘవ ఓ బహిరంగ లేఖను రాయడం జరిగింది.
అయితే ఈ లేఖలో రాఘవ ఏం రాశాడంటే... 'హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్.. మీరంతా ‘మొట్ట శివ కెట్ట శివ’ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాను. దర్శకుడు సాయి రమణి ఈ సినిమాతో నాకు పెద్ద సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పాడు. ఆయన టైటిల్ కార్డులో మక్కల్ సూపర్ స్టార్ అని పేరు వేయడాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. నేను ఈ టైటిల్ కి సరిపడనని నాకు తెలుసు. నాకు తెలిసి ఒకే ఒక సూపర్ స్టార్ ఉన్నారు. అది తలైవార్ రజినీకాంత్ మాత్రమే. నేను సూపర్ స్టార్ రజినీకాంత్ కు వీరాభిమానిని. నన్ను ఈ పరిశ్రమకు పరిచయం చేసింది కూడా ఆయనే. నేను ఆయనలో మొదటగా రాఘవేంద్ర స్వామిని చూశాను. నేను నా జీవితంలో ఆయనకు సర్వధా రుణపడి ఉంటాను. ఎప్పటికైనా కూడా నేను ఆయనకు అభిమానిగానే ఉంటాను' అంటూ ఓ లేఖను రాశాడు రాఘవ లారెన్స్.
ఇంకా రాఘవ దీనిపై స్పందిస్తూ నేను నా పేరుకు టైటిల్ ను.. మా అమ్మ పేరు వచ్చేట్లుగా ముందుగా నేను ఎంచుకున్నాను. ఇక నుండి నేను ఏ సినిమాలోనైనా కూడానా పేరును కణ్మణి రాఘవ లారెన్స్ అని టైటిల్స్ లో వేసుకుంటాను. అమ్మ పేరుకు మించినది నాకు లేదు... మరొకటి ఏదీ నాకు ఆనందాన్ని ఇవ్వదు. మరే టైటిల్ అమ్మతో సమానం కాదు... అంటూ రాఘవ వెల్లడించడం ఎంత విజ్ఞతను చాటుతుందో తెలుస్తుంది. అన్నీ తెలిసిన వ్యక్తి అనిగిమనిగి ఉంటాడు- ఏమీ తెలియని వాడే ఎగిరెగిరి పడుతుంటాడు అని చెప్పకనే చెప్పాడు రాఘవ లారెన్స్.