ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల వరవడిని మార్చుకుంటున్నట్లుగా తెలుస్తుంది. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఆయన వాగ్ధోరణి ఈ మధ్య కాలంలో నోటి దూల కారణంగా ఎదురైన తంటాలను గమనించి జగన్ అసెంబ్లీలో కాస్త హుందాగా వ్యవహరించనున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నూతనంగా ప్రారంభమైన శాసనసభ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని ఆ సందర్భంగా వైకాపా అధినేత జగన్ జరిపిన మీడియా సమావేశంలో చాలా హుందాగా పలు ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లుగా అర్ధమౌతుంది. ఇప్పటికి జగన్ వాగ్ధోరణిలో కాస్త పరిపక్వత సాధించినట్లుగా పలువురు రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. ఉద్రిక్తతకు, వివాదాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడే సందర్భంలో కూడా జగన్ చాలా నిగ్రహంగా వ్యవహరించి, ఓపిగ్గానే సమాధానాలు వెల్లడించడంపై ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనంగా పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్కడైనా ప్రతిపక్షం అంటేనే నిరంతరం అధికార పక్షాన్ని ఏడిపించడంపైనే దృష్టి సారిస్తుంది. కాగా ప్రస్తుతం జగన్.. దివాకర్ ట్రావెల్స్ ప్రమాదం, ఆ తర్వాత నందిగామ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన తంతుపై అధికారులు నిర్వాకం మొదలైనవి కూడా మాట్లాడారు. కలెక్టర్‌తో సహా అందరినీ జైలుకు పంపించే కార్యక్రమం గురించి జగన్ మాట్లాడ్డం పొరపాటు అయినప్పటికీ ... మిగిలినదాంట్లో తప్పేమీ లేదని సమర్ధించుకుంటూ అలా ఎందుకు అన్నానో అన్న విషయాన్ని గురించి స్పష్టత ఇచ్చాడు కూడాను. వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే.. బస్సు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, మృతులు తదితర విషయాల కంటే జగన్ అన్న మాటలపైనే అధికార పార్టీగానీ, మీడియాగానీ నానా రాద్ధాంతం చేసిందన్నది కాదనరాని సత్యం. ఈ సందర్భంలో ఈ విషయానికి సంబంధించి జగన్ చాలా ఆలోచనతో పూర్వాపరాలను నిశితంగా వివరించి చెప్పడం గొప్ప పరిణామంగానే చెప్పాలి.
ఇదే సమావేశంలో జగన్ జైలుకు వెళ్లడం వంటి విషయాలను విలేకరి ప్రశ్నించినప్పుడు కూడా జగన్ ఏమాత్రం తడుముకోకుండా, చాలా స్పష్టంగా తాను అనుకున్నది కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడంలో చాలా విజ్ఞతను ప్రదర్శించాడనే చెప్పాలి. అప్పుడు జగన్ ఆ విలేకరికి అంత అపహాస్యం అక్కరలేదంటూ బదులివ్వడం ఒక రకంగా చెంప పెట్టులాంటిదే. ఇక్కడ జగన్ ఎంతటి పరిపక్వతను సాధించాడు అంటే ఆ ప్రశ్నను అవకాశంగా తీసుకొని జగన్ తనపై విచారణ జరుగుతున్న కేసులన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమైనవిగా వెల్లడించాడు. ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడేందుకు చంద్రబాబు ఎంత తాపత్రయ పడ్డాడో అన్న విషయాన్ని కూడా అక్కరలేకపోయినా ఆ విషయాన్ని గెలుక్కొని మరీ ప్రస్తావించడం మానసిక వికాసంలో భాగమే. ఇలా జగన్ ఏ ప్రశ్నను దాటవేయడం అంటూ జరగకుండా అనుకున్నది బలంగా చెప్పడంలో చాలా స్పష్టంగా తెల్పడం బాగా తెలుసుకున్నాడనే చెప్పాలి. ఇంకా ఓటుకు నోటుపైన కూడా బాగానే వ్యక్తపరిచాడు. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టిన మీడియా సమావేశం కూడా జరిగింది. అది ఎలా ఉందంటే తన్ను తాను పొగుడుకుంటూ.. గొప్పలను చెప్పుకోడానికే పరిమితమైందని చెప్పవచ్చు. బాబులో అలాంటి ఊకదంపుడు పంథాను ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నా.. జగన్ లో మాత్రం మాట్లాడే శైలిలో పరిణతి సాధించినట్లు తెలుస్తుంది.