'బాహుబలి-ది కన్‌క్లూజన్'కి సంబంధించిన ప్రమోషన్ల వేగాన్ని రాజమౌళి పెంచాడు. ఇటీవలే మహాశివరాత్రి సందర్భంగా సుమకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభాస్‌తో కొన్ని ఇంటర్వ్యూలిప్పించాడు. ఇక బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రంపై ఉన్న అంచనాలకు తగ్గట్లుగా ప్రమోషన్స్ పెంచే పనిలో ఉన్నాడు. ప్రముఖ ఫిలిం క్రిటిక్, జర్నలిస్ట్ అనుపమ చోప్రాకు 'బాహుబలి'లోని మాహిష్మతి రాజ్యం సెట్స్‌లో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. దీంతో ఇది బాలీవుడ్ వెర్షన్ ప్రమోషన్ కోసమే అని అర్ధమవుతోంది. ఈ ఇంటర్వ్యూలో ఆయన సుమ కంటే ఎక్కువ విషయాలను, విశేషాలను అనుపమకి చెప్పి, తన టార్గెట్ బాలీవుడే అని మరోసారి నిరూపించుకున్నాడనే విమర్శలు మొదలయ్యాయి. టాలీవుడ్‌లో తనకి, ప్రభాస్ కి ఉన్న క్రేజ్ రీత్యా ప్రత్యేకంగా ప్రమోషన్స్ అనవసరమని, ఎలాగూ తెలుగు వారందరూ ఈ చిత్రాన్ని తప్పక చూస్తారనే భావనతోనే ఆయన బాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాడంటున్నారు. గతంలో పవన్‌కల్యాణ్ కూడా తన 'సర్దార్ గబ్బర్‌సింగ్'కి ముందు అనుపమా చోప్రాకే ఇంటర్వ్యూ ఇచ్చి బాలీవుడ్‌లో కూడా మంచి మైలేజ్‌ని అందుకున్నాడు.
కానీ అక్కడ ఇంటర్వ్యూకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ సినిమాకు మొదటి షో నుంచే థియేటర్లలో జనాలు కనిపించలేదు. ఇక ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో అనుపమ చోప్రాకు మరలా పిలిచి మరీ రాజమౌళి ఇంటర్వ్యూ ఇవ్వడం సెంటిమెంట్ రీత్యా మంచిదికాదనే సెటైర్లు మొదలయ్యాయి. ఇక రాజమౌళి అంటే హీరోయిజాన్ని, ఎమోషన్స్‌ని పీక్స్‌లో చూపిస్తాడు. ఆయన డైరెక్షన్‌లో నటించే హీరోలు ఆయా చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచినా కూడా ఆ తర్వాతి సినిమాలు ఆ రేంజ్‌లో, అంచనాలకు తగ్గట్టు ఉండకపోవడంతో వరుసగా పరాజయాలను ఎదుర్కొనే పరిస్థితి వాస్తవమే. మరి 'బాహుబలి-ది కన్‌క్లూజన్' తర్వాత ప్రభాస్ ఒకే ఒక్క చిత్రం అనుభవం ఉన్న సుజీత్ దర్శకత్వంలో నటించనున్నాడు. దీనికి భారీ ఎత్తున బడ్టెట్‌ను కేటాయిస్తున్నారు. కాబట్టి సుజీత్ సినిమా కూడా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకునేలా ఉండాలి. లేకపోతే ప్రభాస్ కూడా బాలీవుడ్‌లో వన్ మూవీ వండర్‌గా నిలిచే అవకాశాలున్నాయి. ఈ విషయం ప్రభాస్‌తో పాటు యూనిట్ మొత్తం... పెరిగిన ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోవాల్సివుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.