హీరో కావాలనేది చాలా మంది ఫాంటసీ. దానిలో తప్పులేదు. కానీ తమ సొంత బలం, బలహీనతలు తెలిస్తేనే సక్సెస్ కాగలరు. తమదైన స్పెషల్ దారిని ఎంచుకోవాలి. ఈ విషయంలో తమిళ హీరోగా మారిన విజయ్‌ఆంటోని ఎందరికో నేటితరం వారికి ఆదర్శంగా చెప్పుకోవాలి. ఇక కమెడియన్‌గా మంచి స్వింగ్‌లో ఉన్నప్పుడు అలీ, బ్రహ్మానందం, బాబూ మోహన్ నుంచి ఎందరో హీరోలుగా నటించారు. కానీ ఒకటి రెండు చిత్రాల తర్వాత తమ తప్పు తెలుసుకున్నారు. 'యమలీల, పిట్టలదొర' వంటి హిట్స్ ఉన్నప్పటికీ అలీకి ఆ విషయం బాగానే అర్ధమైంది. ఇక 'బాబాయ్ హోటల్' అంటూ బ్రహ్మానందం, 'లోఫర్ మావా.. సూపర్ అల్లుడు' వంటి చిత్రంలో బాబూమోహన్, కోటలు కూడా ఆ ప్రయత్నం చేసి తర్వాత విరమించారు. ఇక సునీల్ విషయానికి వస్తే కమెడియన్‌గా మంచి స్వింగులో ఉన్నప్పుడు హీరోగా మారాడు. 'అందాలరాముడు, మర్యాదరామన్న, పూలరంగడు' వంటి తనకు తగ్గ కథలతో ఓకే అనిపించాడు. ఆ తర్వాత నుంచి హీరోగా ఆయన కెరీర్ పతనం మొదలైంది. అయినా ఇప్పటికీ స్టార్స్ చిత్రాలలో మంచి సపోర్టింగ్ రోల్స్ వస్తున్నా ఆయన వాటిని అంగీకరించలేకపోతున్నాడు. వరుస కామెడీ వేషాలతో మెప్పించిన యువతరం కమెడియన్ సప్తగిరి పరిస్థితి కూడా ప్రస్తుతం రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఈ విషయంలో పరభాషా కమెడియన్స్ కూడా అవే తప్పులు చేస్తున్నారు. గతంలో నగేష్ 'సర్వర్‌సుందరం' వంటి కామెడీ హిట్‌లో నటించినా తర్వాత మరలా కమెడియన్, విలన్ వేషాలు కూడా వేసి మెప్పించాడు. మొన్నటి వరకు ప్రతి చిత్రంలో కనిపించిన తమిళ సీనియర్ కమెడియన్ వడివేలు కామెడీ పాత్రలను మర్చిపోయి, పులకేశి వంటి చిత్రాలతో తనను తాను ఎక్కువగా ఊహించుకొని, ఆనాటి క్రేజ్‌ను, భారీ అవకాశాలను, రెమ్యూనరేషన్లను కోల్పోయాడు. ఇప్పుడు మరలా కమెడియన్‌గా మారాడు. ఇటీవలి కాలంలో వడివేలు స్థానాన్ని భర్తీ చేసిన కమెడియన్ సంతానం. ఈయనకు నిన్న మొన్నటివరకు తమిళనాడులో కమెడియన్‌గా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏడాదికి 20కి పైగా చిత్రాలలో నటించేవాడు. రజనీ వంటి స్టార్స్ కూడా వడివేలు. సంతానం, వివేక్ వంటి వారి డేట్స్‌కోసం ఎదరుచూసేవారు. ఇక సంతానం అంత స్వింగ్‌లో ఉన్నప్పుడు సునీల్ దారిలోనే అడుగులు వేశాడు. 'మర్యాదరామన్న' రీమేక్‌తో హీరో అయ్యాడు. ఆ తర్వాత ఆయన చేసిన ఏ చిత్రం కూడా ఆడలేదు. ఇక కమెడియన్ అవకాశాలు ఆగిపోయాయి. దీంతో సంతానం కూడా దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.