పవన్‌కళ్యాణ్‌కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌శ్రీనివాస్‌కి మద్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. కాగా త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని పవన్ హీరోగా చేస్తున్న సంగతి విదితమే. 'అ..ఆ' చిత్రం విడుదలైనప్పటి నుంచీ త్రివిక్రమ్ పవన్ సబ్జెక్ట్ మీదనే ఉన్నాడు. వాస్తవానికి ఈ గ్యాప్‌లో ఆయనతో ఓ మీడియం రేంజ్ హీరోతో, ఓ మీడియం బడ్జెట్ చిత్రాన్ని నిర్మించాలని ఓ నిర్మాత భావించాడట. దీనికి గాను త్రివిక్రమ్‌కి 10కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్దపడినా కూడా త్రివిక్రమ్ ఆ ఆఫర్‌ని తిరస్కరించాడని సమాచారం. అదే సమయాన్ని పవన్ స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దడానికే ఆయన కేటాయించి తన నిబద్దతను చాటుకున్నాడని తెలుస్తోంది. స్వర్గీయ ఎన్టీఆర్‌కు దాసరి 'బొబ్బిలిపులి' అందించినట్లుగా, పవన్ పొలిటికల్ కెరీర్‌కు, ఆయన పొలిటికల్‌మైలేజ్‌కి ఉపయోగపడే విధంగా ఈ చిత్రం తీయాలని త్రివిక్రమ్ కసిగా ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులను ఆధారంగా చేసుకుని, పొలిటికల్ సెటైర్స్, పంచ్‌లు విసురుతూ, పవన్ వ్యక్తిత్వాన్ని, జనసేన ఆవశ్యకతను, ఆయన రాజకీయాలలోకి రావడానికి గల కారణాలను స్పృశిస్తూ ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఇప్పటికే ఈ చిత్రానికి నాగార్జున నటించిన 'సంతోషం' చిత్రంలోని 'దేవుడే దిగి వచ్చినా' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అధికారికంగా ప్రకటించకపోయినా కూడా ఇదే టైటిల్‌ను వర్కింగ్ టైటిల్‌గా నిర్ణయించారని మాత్రం తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ సొంత బేనర్‌వంటి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. నాన్ బాహుబలి రికార్డులను సైతం సొంతం చేసుకునేలా ఈ చిత్రానికి భారీ బడ్టెట్‌ను కేటాయిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఏప్రిల్ మొదటి వారంలో దుబాయ్‌లో జరగనుంది. ఈ చిత్రకథకి, దుబాయ్‌కి ఎంతో సంబంధం ఉండటంతోనే అక్కడ షెడ్యూల్ చేయాలని నిర్ణయించారట. ఇక ఈ చిత్రంలో కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా, కీలకపాత్రలను ఖుష్బూ, మోహన్‌లాల్‌లు పోషిస్తున్నారని సమాచారం. కాగా ఈ చిత్రం ద్వారా తమిళ సంచలన దర్శకుడు అనిరుధ్ టాలీవుడ్‌కి పరిచయం కానుండటం విశేషం.