నటన అంటే అందులో వాచికానికి కూడా ఎంతో ప్రాదాన్యం ఉంటుంది. గతంలో భాషపై పట్టు, పాత్రలకు తగ్గట్లుగా డైలాగ్ డెలివరీ అనేవి చాలా కీలకంగా భావించే వారు. స్వర్గీయ ఎన్టీఆర్, ఏయన్నార్, శివాజీ గణేషన్, ఎస్వీరంగారావు, సావిత్రి, కన్నడ కంఠీవర రాజ్‌కుమార్ వంటి వారు ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారు. ఇక కె.విశ్వనాథ్ చిత్రాలలోని డైలాగ్‌లు, పాటలు ఎంతో బావుకతతో ఉంటాయి. అలాంటి విశ్వనాథ్ దర్శకత్వంలో నటించే అవకాశం ది గ్రేట్ మమ్ముట్టికి 'స్వాతి కిరణం' ద్వారా లభించింది. ఈ చిత్రానికి మొదట మమ్ముట్టికి మన వారి చేత డబ్బింగ్ చెప్పించాలని భావించారు. అందునా ఈ చిత్రంలో మమ్ముట్టిది ఎంతో క్లిష్టమైన విద్వాంసుడి పాత్ర. కాగా ఈ చిత్రంలో మమ్ముట్టిని నటించమని అడిగినప్పుడు ఆయన ఒకే ఒక కండీషన్ పెట్టాడట. తెలుగు భాషలోని డైలాగ్‌లు, పాటలు ఎంత కష్టమైనా తనకు ఫర్వాలేదని, కానీ ఆ చిత్రానికి తానే స్వయంగా డబ్బింగ్ చెప్పడానికి అనుమతిని ఇస్తేనే చేస్తానని తెలిపి, అద్భుతమైన నటనతో పాటు డైలాగ్‌లను, తెలుగు భాషను కూడా ఎంతో కష్టపడి మమ్ముట్టినే చెప్పారు. కాబట్టే వారు ఎంతో ఎత్తుకు ఎదిగారు.
ఇక బిగ్‌బి అమితాబచ్చన్‌కు అంతటి కీర్తి, పేరు ప్రతిష్టలు, క్రేజ్ రావడానికి ఆయన గంభీరమైన కంఠస్వరం కూడా కారణం. ఇటీవల బాలకృష్ణ, కృష్ణవంశీ దర్శకత్వంలో 'రైతు' చిత్రం చేయాలని భావించాడు. అందులో కీలకమైన రాష్ట్రపతి పాత్రకు అమితాబ్‌ని ఒప్పిస్తేనే ఈ చిత్రం చేస్తానని, లేకుంటే ఈ చిత్రం చేయనని బాలయ్య తెగేసిచెప్పాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రైతుల సమస్యలను విని, బాధపడి, ఉద్వేగపడే రాష్ట్రపతి పాత్ర అమితాబ్‌ది. ఈ పాత్రకు ఒక ఉపన్యాసం వంటి భావోద్వేగమైన లెంగ్తీ డైలాగ్‌లు ఉన్నాయట. ప్రస్తుతం తన ఆరోగ్యరీత్యా పెద్దగా పట్టులేని తెలుగులో తాను స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోలేనని,అలాగే నటనలో మిళితమైన వాచకంను వేరొకరి చేత డబ్బింగ్ చెప్పిస్తే, తన ఇమేజ్‌కు తానే గండికొట్టుకున్నట్టు అవుతుందని భావించిన అమితాబ్ స్వర్గీయ ఎన్టీఆర్ కుమారునిగా బాలయ్యపై మంచి అభిమానం ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చిత్రానికి నో చెప్పాడట.