దేశంలో ప్రాంతీయాభిమానం వెర్రితలలు వేస్తోంది. ఇక జాతీయవాదం కూడా అలాంటిదే. అమెరికా నుండి పాకిస్థాన్ వరకు, ఏపీ, తెలంగాణల నుంచి మహారాష్ట్ర వరకు ప్రజలను కొందరు ప్రాంతీయ వాదాల పేరుతో రెచ్చగొడుతున్నారు. దీనిపై పూరీ వంటి దర్శకుడు 'కెమెరామేన్ గంగతో రాంబాబు' వంటి చిత్రంలో చూపించినందుకు తెలంగాణ వాదులు ఆయన ఆఫీస్‌ను ధ్వంసం చేశారు. ఇక కన్నడలో కూడా అదే పరిస్థితి. సినిమాలకు, కళలకు ప్రాంతీయ భేదాలు ఉండవని చెప్పి, తమ కన్నడ చిత్రాలను మాత్రం ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసే కన్నడ హీరోలు, దర్శకనిర్మాతలు తమ వంతు వచ్చేసరికి మాటమారుస్తారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ నుంచి ఆయన కుమారుల వరకు ఎందరో రోడ్లపైకి వచ్చి కర్ణాటకలో డబ్బింగ్ చిత్రాలను నిషేధించారు. దాదాపుగా 40 ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
40ఏళ్ల తర్వాత ఓ తమిళస్టార్ తన చిత్రాన్ని కన్నడలోకి డబ్ చేసి విడుదల చేయడానికి ముందుకు వచ్చాడు. తమిళస్టార్ అజిత్.. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించిన 'ఎన్నై ఎరిందాల్' చిత్రాన్ని కన్నడలో 'సత్యదేవ్ ఐపియస్' గా అనువాదం చేసి మార్చి3న కర్ణాటకలోని 90థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కన్నడ సంఘాలు, సినీ ప్రముఖులు రోడ్ల మీదకు వచ్చి బెంగుళూరుతో సహా అన్నిచోట్లా ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శనను బలవంతంగా, హింసాయుత పద్దతిలో అడ్డుకున్నారు. ఇక సినీ నటుడు, బిజెపి ఎమ్మెల్సీ అయిన జగ్గేష్ అయితే ఈ చిత్రాన్ని విడుదల చేసే థియేటర్లను తగలబెడతామని, రక్తం ఏరులై పారుతుందని బహిరంగంగా హెచ్చరించడం చూస్తే మనం ఉన్నది నిజమైన ప్రజాస్వామ్యంలోనేనా? అనే అనుమానం రాకమానదు.