టాలీవుడ్‌లో మెగా హీరోలు చాలా మందే ఉన్నారు. కాగా ఈ మెగాఫ్యామిలీకి చెందిన హీరోలు ఒకే హీరోయిన్, ఒకే దర్శకుడు వంటి సెంటిమెంట్లను పాటిస్తారనే వాదన ఉంది. ఇక యాదృచ్చికమో లేక ఉద్దేశ్యపూర్వకమో తెలియదు కానీ కొన్ని సార్లు ఈ హీరోలు ఒకే తరహా చిత్రాలను ఎంచుకుంటూ ఉంటారు. ఆమధ్య అందరూ వరస పెట్టి పోలీస్ చిత్రాలు చేశారు. ఆ తర్వాత అందరూ కూడ బలుక్కున్నట్లు రీమేక్‌లలో నటించారు. ఇక ఒకేసారి పవన్ 'గోపాల' అంటూ, చరణ్ 'గోవిందుడు.. ', వరుణ్‌తేజ్‌లు 'ముకుంద'లుగా వచ్చి శ్రీకృష్ణ నామస్మరణ చేశారు. తాజాగా వీరు దేశభక్తి కంటెంట్ ఉన్న చిత్రాల వైపు అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి వరుణ్‌తేజ్ నటించిన 'కంచె', చరణ్ నటించిన 'ధృవ' చిత్రాలు కూడా దేశభక్తి ఉన్న చిత్రాలే. ఇక ప్రస్తుతం అల్లు శిరీష్ మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రను పోషిస్తున్న '1971' (బి యాండ్ ది బోర్డర్స్) చిత్రంలో ఓ సపోర్టింగ్ రోల్ చేస్తున్నాడు. మేజర్ రవి దర్శకత్వంలో యుద్దం నేపధ్యంలో రూపొందుతున్న ఈ మలయాళ చిత్రాన్ని తెలుగులో కూడా అనువదించనున్నారు. ఇందులో శిరీష్ ఓ యుద్దట్యాంకర్ ఆపరేటర్‌గా కీరోల్ పోషిస్తున్నాడు.
ఇక సాయిధరమ్‌తేజ్ కూడా 'జవాన్' అనే చిత్రం ప్రారంభించి షూటింగ్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి రచయిత బి.వి.ఎస్.రవి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సాయి 'జవాన్'గా నటించకపోయినా కూడా ఇది కూడా దేశభక్తి కంటెంట్ ఉన్న చిత్రమే అని సమాచారం. తాజాగా లగడపాటి శ్రీధర్ నిర్మాతగా అల్లుఅర్జున్ 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా' చిత్రం చేస్తున్నాడని తెలుస్తోంది. ఈయన కూడా రైటర్ వక్కంతం వంశీని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేయనున్నాడు. కాగా ఈ చిత్రాన్ని బన్నీ బర్త్‌డే కానుకగా ఏప్రిల్8వ తేదీన ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చిరు 151 వ చిత్రం గా చెప్పుకుంటున్న 'ఉయ్యాలవాడ నరసింహరెడ్డి' కూడా దేశభక్తుడి చిత్రమే కావడం విశేషం.