ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఓ బ్రాండ్. హీరో, హీరోయిన్లు ఎవరని కాకుండా కేవలం దానికి త్రివిక్రమ్ డైరెక్టర్ అని తెలిస్తేచాలు.. ప్రేక్షకులు థియేటర్ల వద్ద బారులు తీరుతారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో రచయితగా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న రైటర్‌గా కూడా ఆయనకు పేరుంది. రచయితగా కోటిరూపాయలను తీసుకున్న మొట్టమొదటి రైటర్ ఆయనే కావడం విశేషం. ఇక ఈయన 'నువ్వే.. నువ్వే' నుండి దర్శకునిగా కూడా మారాడు. ఆయన ఒకప్పుడు కేవలం యూత్‌ని టార్గెట్ చేసుకుంటూ డైలాగ్స్ రాసేవాడు. కాలక్రమేణా ఆయన ప్యామిలీ ఆడియన్స్‌ను మెచ్చేలా కూడా తన కలానికి పదును చెప్పారు. కుటుంబాలు, బంధాలు, ఆప్యాయతలతో పాటు జీవిత సత్యాలను, జీవన సారాంశాన్ని కూడా తన డైలాగ్స్‌తో మెప్పించడం మొదలుపెట్టారు. ఇలా ఆయన నేడు అనేక పార్శ్వాలను, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సంభాషణలు రాస్తున్నాడు. ఇక ఆయనకు ఒక దర్శకునిగా కంటే ఓ రచయితగా, మాటల మాంత్రికుడిగానే ఎక్కువ మంది అభిమానిస్తారనేది నగ్నసత్యం. సాధారణ కథను కూడా తన డైలాగ్స్‌తో పీక్‌కి తీసుకుని వెళ్లగల సత్తా ఆయన కలానికి ఉంది. కాగా ఆయన గతంలో 'చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, నువ్వే.. నువ్వే' చిత్రాలకుగాను నంది అవార్డులను అందుకున్నాడు. ప్రాసడైలాగ్‌లేకాదు.. పవర్‌ఫుల్ పంచ్‌లు రాయడంలో కూడా ఆయన దిట్ట. అంతటి క్రేజ్ ఆయనకు తెలుగునాట ఉంది. ఆయన మీదనే ఆధారపడిన నిర్మాతలు, హీరోలు కూడా ఎందరో ఉన్నారు. తాజాగా ఆయనకు 'అత్తారింటికి దారేది' చిత్రం ద్వారా మరో నంది కూడా ఆయన ఇంట కొలువవ్వడానికి రంగం సిద్దమైంది. ఇక ఆ నందీశ్వరుడిని అందుకోవడమే మిగిలిఉంది.