ఒక హిట్ ఇచ్చిన దర్శకులను మరలా రిపీట్ చేయాలని మన స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే మహేష్.. గుణశేఖర్, శ్రీకాంత్ అడ్డాల వంటి వారిని రిపీట్ చేసి ఉన్నాడు. కానీ అవి పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. అయినా కూడా ఆయన 'శ్రీమంతుడు'తో తనకు బ్లాక్‌బస్టర్ ఇచ్చిన కొరటాల శివకు మరో చాన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక పవన్. 'గోపాల గోపాల' తర్వాత 'కాటమరాయుడు'తో మరోసారి డాలీకి అవకాశం ఇచ్చాడు. ఇక తనతో ఇప్పటికే రెండు చిత్రాలను తీసిన త్రివిక్రమ్‌తో మరో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఇక ఎందరినో రిపీట్ చేసిన చిరు.. వినాయక్‌కి సైతం అదే అవకాశం ఇచ్చాడు. త్వరలో బాలయ్య మరోసారి బోయపాటికి చాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నాలుగేళ్ల ఫ్లాప్‌లకు అడ్డుకట్ట వేసి తనకు 'నేను.. శైలజ' వంటి హిట్‌నిచ్చిన కిషోర్ తిరుమలతో పాటు ఫ్లాప్‌నిచ్చిన కరుణాకరన్‌కి రామ్ మరో అవకాశం ఇవ్వనున్నాడు. ఇక 'అష్టాచెమ్మా' తర్వాత 'జెంటిల్‌మేన్'కు ఇంద్రగంటికి అవకాశం ఇచ్చిన నాని త్వరలో హనురాఘవపూడికి మరో అవకాశానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక తనకు 'స్వామి రారా'తో బ్రేక్‌నిచ్చిన దర్శకుడు సుధీర్‌వర్మకు నిఖిల్ సైతం 'కేశవ' అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఇలా మన హీరోలందరూ హిట్ ఇచ్చిన దర్శకులను మరలా మరలా రిపీట్ చేస్తుండటం విశేషం. ఒక హిట్ ఇస్తే మరో చిత్రం బోనస్ అంటున్నారు.