Advertisement

బన్నీ భయపడాల్సిన అవసరం లేదు..!

Sat 04th Mar 2017 02:34 PM
allu arjun,naa peru surya naa illu india,rana ghazi  బన్నీ భయపడాల్సిన అవసరం లేదు..!
బన్నీ భయపడాల్సిన అవసరం లేదు..!
Advertisement

వాస్తవానికి దేశభక్తితో కూడిన జోనర్‌ చిత్రాలను మనసులకు హత్తుకునేలా తీస్తే... అంత కంటే పెద్ద హిట్‌ ఫార్ములా లేదనే చెప్పాలి. గతంలో ఎన్నో ఎన్నెన్నోచిత్రాలు ఈ విషయాన్ని నిరూపించాయి. ఇక వాస్తవంలోకి వస్తే దక్షిణాదిలో కన్నా ఉత్తరాదిలో దేశభక్తి చిత్రాలు ఎక్కువగా వస్తాయి. దేశభక్తి చిత్రాలను ఉత్తరాది వారు ఆదరించినట్లుగా దక్షిణాది వారు ఆదరించరనే ప్రచారం కూడా ఉంది. ఈ వాదన కూడా నిజమేననిపిస్తుంది. కానీ దక్షిణాదిలో కూడా దేశభక్తితో కూడిన చిత్రాలు మన మేకర్స్‌ తీయడం లేదనే కానీ వాటిని తీస్తే మన ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తారు. ఎప్పటి సినిమాల గురించో ఎందుకు? స్వర్గీయ ఎన్టీఆర్‌ నటించిన 'మేజర్‌ చంద్రకాంత్‌' చిత్రంలోని ఆడియో విడుదలైన తర్వాత అందులోని 'పుణ్యభూమి నా దేశం నమో నమామి...' అనే పాట విన్న ఎందరో ఆ పాట కోసమే సినిమాను మరలా మరలా చూసిన దాఖలాలున్నాయి. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు. 

కానీ నేటి మేకర్స్‌ మాత్రం బడ్జెట్‌ రీత్యానో, కమర్షియల్‌గా వర్కౌట్‌ కాదనే ఉద్దేశ్యంతోనే అలాంటి చిత్రాల వైపు మొగ్గు చూపడం లేదు. ఇక తాజాగా రానా నటించిన 'ఘాజీ' చిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రంలో పాక్‌తో యుద్దం, సబ్‌మెరైన్‌ బ్యాక్‌డ్రాప్‌ వంటి వాటికంటే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది దేశభక్తి ప్రేరేపితమైన సన్నివేశాలేనన్నది వాస్తవం. ఇక మహేష్‌ నటిస్తున్న మురుగదాస్‌ చిత్రంతో పాటు కొరటాల శివతో చేయబోయే చిత్రంలో కూడా దేభభక్తి సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం 'డిజె' అనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న బన్నీ ఆ వెంటనే వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారని సమాచారం. ఇంతవరకు లోబడ్జెట్‌, మీడియం బడ్జెట్‌ చిత్రాలను నిర్మించిన నిర్మాత లగడపాటి శ్రీధర్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో దేశభక్తి ప్రధానాంశంగా నిర్మించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ జోనర్‌లో బన్నీ చిత్రం చేయలేదు. కాబట్టి ఈ చిత్రం టైటిల్‌ వింటుంటేనే దేశభక్తి కంటెంట్‌ ఉన్న చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు....! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement