బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కువ చిత్రాలలో శృంగారం పేరుతో విచ్చలవిడి చిత్రాలు వస్తున్నాయి. పోర్న్‌చిత్రాలను మరిపించేలా యూత్‌ను, కిందిస్థాయి ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. అర్ధనగ్న ప్రదర్శనలతో పడకసీన్లు, శృంగారం పేరుతో అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. బాలీవుడ్‌లో ఇప్పుడు ఇలాంటి సీన్లు కామన్ అయిపోయాయి. ఎవ్వరూ దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడమే మానేశారు. ఇతర విషయాలలో ఎన్నో నీతులు చెప్పే సెన్సార్ వారు కూడా ఈ తరహా చిత్రాలను, సీన్స్‌ని పట్టించుకోవడం మానేశారు. దాంతో బ్లూఫిల్మ్‌లను మించిన తరహాలో ఉండే సీన్లు వెండితెరపై దర్శనమిస్తున్నాయి. ఇక తెలుగులో కూడా ద్వందార్దాలు మించిపోయి, ఇప్పుడు లిప్‌లాక్ అంటే ఓ కామన్ విషయంగా మారిపోయింది.
తాజాగా విడుదలైన 'కమాండో2'లో ఆదాశర్మతో హీరో చేసే లిప్‌లాక్‌లు, ఇక తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న 'అర్జున్‌రెడ్డి', 'ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబూ' వంటి చిత్రాల పోస్టర్స్, మేకింగ్ వీడియోలు, లిప్‌లాక్‌లు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. ఇలా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ చిత్రాలు కూడా.. హాలీవుడ్ చిత్రాలను శృంగారపు సీన్ల విషయంలో మించిపోతున్నాయి. ఇక ఇప్పటికే మన సుప్రీం కోర్టు ప్రతి సినిమా ప్రారంభం ముందు, ప్రతి థియేటర్‌లోనూ జాతీయ గీతమైన 'జనగణమన' గీతాన్ని విధిగా ప్రదర్శించాలని, ప్రతి ప్రేక్షకుడు ఈ సందర్భంగా లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై రాంగోపాల్‌వర్మ నుంచి అరవింద్‌స్వామి వరకు, పవన్ నుంచి చిన్న చిన్న వారు సైతం కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
మరి సాధారణ ప్రేక్షకుడి విషయానికి వస్తే ఇలాంటి అడల్ట్‌కంటెంట్ ఉన్న చిత్రాలను చూడాలని పరితపించే ప్రేక్షకులు ఈ చిత్రాల ప్రారంభం ముందు కూడా విధిగా నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలా? అలా చేయకతప్పదు కాబట్టి చేసినా కూడా వారిలో దేశభక్తి వస్తుందా? మరి బుల్లితెరపైనే ఇలాంటివి వీర విహారం చేస్తూ పసిపిల్లల మనోభావాలను సైతం పక్కదారి పట్టిస్తున్న నేపథ్యంలో వీటికి కోర్టులు ఏమి తీర్పు చెబుతాయి? వంటి అనేక సందేహాలు ఎందరినో పట్టిపీడిస్తున్నాయి.