రాష్ట్ర విభజన తర్వాత ఎట్టకేలకు తాజాగా 2012, 2013 చిత్రాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నంది అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల వివరాలు బయటకు తెలిపిన తర్వాత నుంచి వీటి ఎంపికలో పారదర్శకత లేదని, భారీ లాబీయింగ్ జరిగిందనే విమర్శలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు ఈ వేడి మరింతగా రాజుకుంటోంది. రోజు రోజుకు ఈ అవార్డుల ఎంపిక వ్యవహారం ముదిరి పాకానపడుతోంది. తాజాగా ఓ హీరో ఫ్యాన్స్ ఈ అవార్డుల ఎంపికలో తమ హీరోకు అన్యాయం జరిగిందని ఓ పట్టణంలో నిరసనకు దిగారు. ఇక ఉత్తమచిత్రాల ఎంపికలో 'మిర్చి'కిగాను ప్రభాస్, 'అత్తారింటికి దారేది' చిత్రంతో పవన్, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ద్వారా మహేష్‌లు పోటీలో నిలిచారు. కానీ అవార్డు మాత్రం ప్రభాస్‌కి దక్కింది. కమర్షియల్ హిట్ చిత్రాలకు అవార్డులు ఇవ్వకూడదని ఎవ్వరు అనడం లేదు. కానీ ఏ ప్రాతిపదికన 'మిర్చి'లో ప్రభాస్‌కు ఉత్తమనటుడి అవార్డు వచ్చిందో బహిరంగంగా చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 'మిర్చి' ఒక రొటీన్ కమర్షియల్ ఫార్ములా చిత్రం. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు కొరటాల శివ కూడా ఒప్పుకున్నాడు. పాత కథనే కాస్త కొత్తదనంతో చూపించానని చెప్పాడు. ఇక ఈచిత్రంలో హీరోకు ఉండే నటనా పార్శ్యాలు కూడా తక్కువే. ఆ లెక్కలో చూసుకుంటే 'అత్తారింటికి దారేది', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలలో హీరోలుగా నటించిన పవన్, మహేష్‌ల పాత్రలకే ఎంతో వైవిద్యమైన నటన చూపించే అవకాశం లభించింది. కానీ అవార్డు కమిటీ మాత్రం ప్రభాస్‌కు ఓటేసింది. దీనిని తప్పు అని కొందరు వాదిస్తున్నారు.
ఇక 'మిర్చి'తో పోలిస్తే 'అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలు కమర్షియల్‌గా పెద్ద హిట్‌లు కావడమే కాదు.. ఇవి కుటుంబ సమేతంగా హాయిగా చూడదగ్గ క్లీన్‌చిత్రాలు అనేది వాస్తవం. ఇక 'బాహుబలి2' విడుదల నేపథ్యంలో ప్రభాస్‌కి అవార్డు వచ్చేలా భారీ లాబీయింగ్ జరిగిందని, దీనికి బాహుబలి టీంలోని రాజమౌళి, ఆయన గురువు రాఘవేంద్రరావులు కూడా సాయం చేశారని విమర్శలు వస్తున్నాయి. ఇక నేషనల్ అవార్డుతో పాటు ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్‌లో గొప్ప పేరు తెచ్చుకున్న 'నా బంగారు తల్లి, మిణుగురులు, మిథునం' వంటి చిత్రాలకు కూడా అన్యాయం జరిగిదంటున్నారు. ఉత్తమ సంగీత దర్శకులుగా ఇళయరాజా, కీరవాణిలకు అవార్డుల విషయంలో కూడా పలు విమర్శలు వస్తున్నాయి. నేడున్న స్థితిలో ఇళయరాజా, కీరవాణి, పవన్, మహేష్ వంటి వారికి కొత్తగా అవార్డుల వల్ల వచ్చే ఉత్సాహం ఏమీ ఉండదు. కాబట్టి అప్‌కమింగ్ వారిని ప్రోత్సహించాలని కొందరు సైటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి నంది అవార్డులకే కాదు. నేషనల్ అవార్డుల విషయంలో, చివరకు పద్మశ్రీ నుంచి భారతరత్న వరకు అన్నీ చోట్లా లాబీయింగ్‌కే ప్రాముఖ్యం ఇస్తున్నారు. కాబట్టి ఈ అవార్డులకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోతోంది. ఇక పవన్, మహేష్‌లకు ఏపీ ప్రభుత్వంతో సరైన సత్సంబంధాలు లేకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ఈ లెక్కన 'బాహుబలి' చిత్రానికీ ఈ సారి జాతీయ స్థాయిలో అవార్డులు రావడం గ్యారంటీ అనే సెటైర్లు వినిపిస్తుండటం విశేషం.