టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రం రిలీజై ఎంత పెద్ద సక్సెస్ ను సాధించిందో అందరికీ తెలిసిందే. సమాజంపై కూడా ఈ చిత్రం బాగానే ప్రభావం చూపింది. విడుదలయ్యాక ఈ చిత్ర కథను తన నవల నుండి కాపీ కొట్టి సినిమా చేశారని రచయిత శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కథను చచ్చేంత ప్రేమ అనే తన నవల నుండి కాపీ చేశారన్నది ఆ రచయిత ప్రధాన ఆరోపణ.
అయితే రచయిత కోర్టును ఆశ్రయిస్తే.. నాంపల్లి క్రిమినల్ కోర్ట్ ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివతో పాటు మహేష్ బాబుకి కూడా సమన్లను జారీ చేసింది. అంతేకాకుండా జనవరి 24వ తేదీన విచారణ కోసం కోర్టుకు హాజరు కావాలని తెలిపింది కూడానూ. దాంతో హీరో మహేష్ అండ్ దర్శకుడు కొరటాల తమపై జారీ చేసిన సమన్లను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ అంశాన్ని పరిశీలించిన కోర్టు.. నాంపల్లి క్రిమినల్ కోర్టు జారీ చేసిన సమన్ల అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు ఈ సమన్ల నిలిపివేత వీరిద్దరికీ పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా త్వరలో ప్రారంభమౌతున్న ఈ నేపథ్యంలో శ్రీమంతుడు సినిమా కోసం కోర్టుకు హాజరు కావడం అనేది ఇబ్బంది పెట్టే అంశమనే చెప్పాలి. ఇప్పుడు అటువంటి అమలును నిలిపివేయడంతో వీరికది పెద్ద ఊరటనే చెప్పవచ్చు. కానీ.. కేసు తాలూకూ వ్యవహారం ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కాపీరైట్ కు సంబంధించిన ఈ కేసును కోర్టు తీవ్రంగా పరిగణించే అవకాశాలు లేకపోలేదు.