సినిమా అనేది వ్యాపారం. కాబట్టి సినిమా తీసే నిర్మాత, కొనే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆర్థిక విషయాలపైనే దృష్టి పెడతారు. కాగా సినిమా నిర్మాతకు, సినిమా ప్రేక్షకులకు వారధి వంటి వాడు డిస్ట్రిబ్యూటర్. ఏ సినిమా రిలీజ్ కావాలన్నా డిస్ట్రిబ్యూటర్లు ముఖ్యం. కానీ ఈమధ్య కొందరు డిస్ట్రిబ్యూటర్లు తామే తప్పు చేస్తూ, నిర్మాతలను, హీరోలను నిందిస్తున్నారు. ఓ చిత్రాన్ని ఏ రేటుకు కొనాలి? ఆ రేటు వర్కౌట్ అవుతుందా? కాదా అని నిర్ణయించుకోవాల్సింది డిస్ట్రిబ్యూటర్లే. నాన్ రికవబుల్, రికవబుల్ అమౌంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రికవబుల్ అమౌంట్ విషయంలో సినిమాలకు లాభాలు వస్తే డిస్ట్రిబ్యూటర్లు దానిలో నిర్మాతలకు కూడా వాటా ఇవ్వాలి. నష్టాలు వస్తే డబ్బు రూపేణా కావచ్చు.. లేదా అదే నిర్మాత చేయబోయే మరో చిత్రంలో గానీ ఆ నష్టాన్ని భర్తీ చేస్తారు. కానీ నాన్‌రికవబుల్ విషయంలో లాభనష్టాలకు నిర్మాతలు బాధ్యులు కారు. ఎక్కువ లాభాలు వస్తే డిస్ట్రిబ్యూటర్లు ఎంజాయ్ చేస్తారే గానీ తిరిగి దానిలో వాటాను నిర్మాతలకు ఇవ్వరు కదా..! మరి నష్టాలు వస్తే మాత్రం నిర్మాతలను, హీరోలను నిందించి తప్పునంతా వారిపైనే వేయడం ఎంతవరకు సబబు. ఎక్కువ రేటు చెప్పినా కూడా తమ లాభాలలో నిర్మాతలకు వాటా ఇవ్వడం ఇష్టంలేని డిస్ట్రిబ్యూటర్లు ఈమధ్య ఎక్కువగా నాన్‌రికవబుల్ అగ్రిమెంట్ల వైపే ఆసక్తి చూపడం వారి తప్పుకాదా...?
ఇక ఎగ్జిబిటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలో వారే బ్లాక్‌టిక్కెట్లను ప్రోత్సహిస్తున్నారు. వచ్చిన కలెక్షన్లను వారు నిర్మాతలకు తక్కువ చేసి చూపుతున్నారు. ఇది నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మరీ ఎక్కువైంది. ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు అభిప్రాయ బేధాలు వస్తే కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకునే వారు. కానీ ఇప్పుడు వీరి మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు తప్పు తమ వైపే పెట్టుకుని మీడియాకు ఎక్కి నిర్మాతలను, హీరోలను బజారుకీడిస్తూ, వారి పేరు ప్రతిష్టలను బద్‌నాం చేస్తున్నారు. ఇక హీరోలు కూడా తమ చిత్రాలకు నష్టం వచ్చినప్పుడు ముందుకు వచ్చి రెమ్యూనరేషన్స్‌ని కూడా తగ్గించుకొని ఇచ్చేస్తున్నారు. ఈ మంచితనం, మొహమాటం వల్లనే పలు ఇబ్బందులు వస్తున్నాయి. రజనీకాంత్ నుంచి పవన్, మహేష్ ల వరకు ఈ విధంగా బాధపడుతున్నవారు ఎందరో ఉన్నారు. ఇదంతా చూస్తుంటే మంచికి, మొహమాటానికి వెళ్లితే, ఏదో జరిగిందని పెద్దలు చెప్పిన ఓ మోటు సామెతను చెప్పుకోవాల్సివస్తోంది.