బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఆస్తులు.. తన తర్వాత ఎవరికి ఎంత చెందుతాయన్న విషయాన్ని వెల్లడించాడు. మరి అమితాబ్ బచ్చన్ తన ఆస్తులను కూతురికి, కొడుకుకు సమానంగా పంచుతానని వెల్లడించాడు. మన హీరోలు గానీ, పారిశ్రామిక వేత్తలు గానీ సహజంగా వారసుడి కోసం తన ఆస్తినంతా అట్టిపెట్టుకొని, కూతురుకు మాత్రం ఎంత వీలైతే అంత కట్నాలు రూపేనా ఇచ్చి సరిపెట్టేసుకోమని చెప్తుంటారు. అది ఇన్నాళ్ళు భారతీయ సమాజంలో జరుగుతున్న వ్యవహారం. ఆ తర్వాత ఎన్ని కోట్లు ఉన్నాగానీ అదంతా వారసుడి కిందికే వస్తుంది. ఇప్పుడు భారతీయ సమాజానికే మార్గదర్శకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వేసిన అడుగులు అందరికీ ఆదర్శ ప్రాయమైనవిగా చెప్పవచ్చు.
జండర్ ఈక్వాలిటీ గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ... తాము మరణించిన తర్వాత తన ఆస్తి అంతా తన కూతురుకు, తన కొడుకుకు సమానంగా వచ్చేలా పంచుతానంటూ వెల్లడించాడు. త్వరలో రానున్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమితాబ్ ఈ కామెంట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎప్పుడూ సామాజిక సంబంధమైన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉండే అమితాబ్ ఈ సారి స్త్రీ పురుష సమానత్వాన్ని గురించి వివరించి సమాజానికి దిక్సూచిలా మారాడు. కాగా గతంలో కూడా అమితాబ్ తన మనమరాళ్ళకు రాసిన లేఖ అందరినీ ఆకర్షించింది. అమితాబ్ లేఖలో మాకు ఉన్న స్టార్ డమ్ మీకు ఎలాంటి స్వేచ్ఛను హరించదు. మమ్మల్ని చూసి మీరు ఎలాంటి ఆంక్షలు విధించుకోకండి. మీకు నచ్చినట్లు మీరు ఉండండి అని వెల్లడించిన విషయం తెలిసిందే.