గ్రామాల దత్తత ఆధారంగా తెరకెక్కిన 'శ్రీమంతుడు' చిత్రం ఘనవిజయం సాధించింది. దీంతో చాలా మంది సెలబ్రిటీలు కూడా గ్రామాల దత్తతకు ముందుకొచ్చారు. కాగా మహేష్‌బాబు ఏపీలోని తన సొంత గ్రామమైన బుర్రిపాళెంను, తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్నాడు. ఆయన భార్య నమ్రతా ఈ వ్యవహారాలను చూసుకుంటోంది. మహేష్ బిజీ బిజీ కావడంతో నమ్రత ఆ బాధ్యతలను స్వీకరించింది. అయినా దత్తత తీసుకున్న గ్రామాలను పట్టించుకోవడం లేదని కొందరు విమర్శలు చేస్తున్నారు. కానీ నమ్రత మాత్రం ఎప్పటికప్పుడు ఆయా గ్రామాలకు అవసరమైన వసతులు, మౌళిక సదుపాయాల గురించి తెలుసుకుంటూనే ఉంది. తాజాగా ఆమె సిద్దాపురంలోని పాఠశాల నిర్మాణానికి 30లక్షల విరాళాన్ని అందజేసింది. ఈ చెక్‌ను ఆమె రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు అందజేసింది. అంతేకాదు.. నిధులు దుర్వినియోగం కాకుండా కూడా నమ్రత ఎప్పటికప్పుడు అభివృద్ది పనులను పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే బుర్రిపాళెం గ్రామానికి కూడా మహేష్ భారీ విరాళం అందించనున్నట్లు సమాచారం. మొత్తానికి మహేష్, నమ్రతలు నిజజీవితంలో కూడా గ్రేట్ అనిపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తుండటం విశేషం.