కళలకు భాషా బేధాలు లేవు... ఇక సంగీతానికి ఎల్లలు లేవు. ఇళయరాజా, రెహ్మాన్ వంటి వారు ఈ విషయాన్ని నిరూపించారు. ఇక దేవిశ్రీ, తమన్‌లు కూడా కోలీవుడ్‌లో పనిచేస్తున్నారు. మణిశర్మ తెరమరుగు కావడం, కీరవాణి ఆచితూచి చిత్రాలు చేస్తూ రిటైర్‌మెంట్ దిశగా అడుగులు వేస్తుండటంతో దేవిశ్రీ, తమన్, మిక్కీజె మేయర్, అనూప్‌రూబెన్స్ వంటి వారికి క్రేజ్ పెరిగింది. కానీ దేవిశ్రీ తప్ప మిగిలిన సంగీత దర్శకులు మన స్టార్స్‌ని మెప్పించడంలో వెనుకబడిపోతున్నారు. స్టార్ హీరోలందరికీ ఇప్పుడు దేవిశ్రీనే దిక్కయ్యాడు. ఆయన ఒక వటవృక్షంలా తయారయ్యాడు. ఈ ఏడాది ఇప్పటికే 'ఖైదీనెంబర్150, నేను..లోకల్'తో జోరు మీదున్న దేవిశ్రీ బన్నీ 'డిజె, సుక్కు-చరణ్, ఎన్టీఆర్-బాబి, కొరటాల-మహేష్' చిత్రాలకు కమిట్ అయ్యాడు. బన్నీకి, దిల్‌రాజుకు, 'గబ్బర్‌సింగ్'తో హరీష్‌శంకర్‌కు ఆయన భారీ మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ఇక ఆయన వరుసగా జూనియర్‌కు హ్యాట్రిక్ మూవీ చేయనున్నాడు. అదే సమయంలో 'సర్దార్' తర్వాత బాబికి పనిచేస్తున్నాడు. కొరటాలకు ఆస్థాన సంగీత విద్యాంసుడిగా మారిపోయాడు. మహేష్‌కి కూడా మంచి హిట్స్ ఇచ్చాడు. ఇలా ప్రస్తుతం టాలీవుడ్‌లో రాకింగ్‌స్టార్ దేవిశ్రీ హవా సాగుతోంది.
ఇక దేవిశ్రీని వదలని త్రివిక్రమ్ 'అ..ఆ' ద్వారా తమిళ సంగీత సంచలనం అనిరుద్‌కి అవకాశం ఇచ్చాడు. కానీ పలు కారణాల వల్ల ఈ చిత్రానికి అనిరుద్ పనిచేయలేదు. దాంతో త్వరలో త్రివిక్రమ్-పవన్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రానికి అనిరుధ్‌ని తీసుకున్నారు. ప్రస్తుతం మన స్టార్‌హీరోలు ఇతర ఇండస్ట్రీలలో కూడా మార్కెట్ పెంచుకోవాలనుకుంటున్నారు. కాబట్టి అన్ని భాషల్లో గుర్తింపు ఉన్న సంగీత దర్శకులకు అవకాశాలు కనిపిస్తున్నాయి. గిబ్రాన్, గోపీసుందర్ వంటి పరభాషా సంగీత దర్శకులు తమకొచ్చిన పేరును నిలబెట్టుకోలేకపోతున్నారు. దీంతో మహేష్-మురుగదాస్ చిత్రానికి హరీస్‌జైరాజ్‌కి అవకాశం వచ్చింది. మరి అనిరుధ్ అయినా టాలీవుడ్‌లో మాయ చేసి స్టార్ హీరోలను లైన్‌లో పెడతాడా? 'కాటమరాయుడు'తో అనూప్‌రూబెన్స్ మ్యాజిక్ చేస్తాడా? అనేది వేచిచూడాల్సివుంది.