'లీడర్' చిత్రంతో సోలో హీరోగా దగ్గుబాటి వారసుడు రానా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా 'నా ఇష్టం.., నేను.. నా రాక్షసి' వంటి చిత్రాలు చేశాడు. కానీ సోలో హీరోగా సరైన హిట్ మాత్రం లభించలేదు. ఇక 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందినా కూడా కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ఆయన కొన్ని చిత్రాల ద్వారా కోలీవుడ్‌కు, బాలీవుడ్‌కు కూడా సుపరిచితుడైనాడు. అక్కడ కూడా ఆయనకు గుర్తింపు వచ్చింది. కానీ ఆయన భళ్లాలదేవగా విలన్ పాత్రలో నటించిన 'బాహుబలి-ది బిగినింగ్' చిత్రం రానాకు ఎక్కడలేని గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం 'ఘాజీ' విమర్శకుల ప్రశంసలతో పాటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లలో కూడా మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఈ మూడు భాషల్లో కలిపి దాదాపు 30కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. సో.. ఇప్పడు రానాకు సోలో హీరోగా 30కోట్లు మార్కెట్ ఉందని కొందరు వాదిస్తున్నారు.
కానీ ఇక్కడ ఒక్క విషయం ఏమిటంటే... 'బాహుబలి'లానే 'ఘాజీ' చిత్రం కూడా ఓ డిఫరెంట్ మూవీ. ఓ ప్రత్యేక చిత్రం. కాబట్టి 'ఘాజీ'తో రానా స్టామినాపై ఓ అంచనాకు రావడం కష్టం. ఇక త్వరలో 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం విడుదలకానుంది. ఈ చిత్రంతో తనకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు వస్తుందని రానా భావిస్తున్నాడు. తాజాగా ఆయన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా తేజ దర్శకత్వంలో 'నేనే రాజు... నేనే మంత్రి' అనే చిత్రం చేస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కూడా చివరి దశకు వచ్చిందని సమాచారం. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడే విడుదల చేయకుండా ఏప్రిల్ 28న 'బాహుబలి-ది కన్‌క్లూజన్' రిలీజ్ తర్వాత ఓ నెల గ్యాప్ తీసుకుని మే చివరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం కూడా లిమిటెడ్ బడ్జెట్‌తోనే రూపొందుతోంది. ఫేడవుట్ అయిన దర్శకుడు తేజ డైరెక్షన్ చేస్తున్నాడు. మరి ఈ చిత్రం మొదట తెలుగులో ఎంత వసూలు చేస్తుంది? అనే దానిపై ఆయన మార్కెట్‌ను, స్టామినాను అంచనా వేయవచ్చు. ఇక బాలీవుడ్, కోలీవుడ్‌లలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే దానిని అదనపు ఆదాయంగా మాత్రమే చూడాలి... సో.. రానా స్టామినా తెలియాలంటే మే చివరి వరకు ఎదురుచూడాల్సివుంది...!