నేటితరం యంగ్ స్టార్ డైరెక్టర్స్‌లో సుకుమార్‌ది విభిన్నశైలి. ఆయన చిత్రాలు సాధారణ ప్రేక్షకులకు ఎలా అర్ధం కావో.. ఆయనని శాటిస్‌ఫై చేయడం కూడా నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కష్టమే. తాననుకున్న అవుట్‌పుట్ వచ్చే వరకు ఆయన ఒప్పుకోడు. కాగా ప్రస్తుతం సుక్కు.. రామ్‌చరణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న హ్యాట్రిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జనవరిలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రం ప్రీలుక్ పోస్టర్ ఎందరినో విపరీతంగా ఆకర్షించింది. కావడి భుజాన పెట్టుకుని, లుంగీ కట్టుకుని, చుట్టూ పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా ఉన్న ఆ పోస్టర్‌తో సుక్కు ఈసారి గ్రామీణ నేపథ్యం ఉన్న కథని డైరెక్ట్ చేయనున్నాడనే వార్తలకు బలం చేకూరింది. ఈ చిత్రం అచ్చమైన పల్లెటూరి కథ అని రివీల్ అయినా, మధ్యలో సుక్కు సాధారణ ప్రేక్షకులకు అర్ధం కాని వ్యవహారం ఏమైనా పెడతాడా? అనే అనుమానాలైతే వినిపిస్తున్నాయి.
కానీ సుక్కు, చరణ్‌లు మాత్రం ఇది ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేని కథ అని హామీ ఇస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరో చరణ్ వస్త్రధారణ ఎలా ఉంటుందో ఓ అంచనా వచ్చినప్పటికీ ఆయన లుక్ ఎలా ఉండనుంది? అనే దానిపై పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కోసం చరణ్ చేత దర్శకుడు సుకుమార్ ఏకంగా 15లుక్స్‌ని ప్రిపేర్ చేయించి, చివరకు తాజాగా ఓ లుక్‌ని ఫైనల్ చేశాడట. 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో ఎన్టీఆర్ లుక్‌ని పూర్తిగా మార్చివేసిన సుక్కు, చరణ్‌ని కూడా అలాగే కొత్తగా చూపించనున్నాడట. ఇక ఈ చిత్రంలోని చరణ్ లుక్ ఫైనల్ కావడంతో ఈ చిత్రాన్ని మార్చి 20 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు రంగం సిద్దం చేస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఇక సుక్కుకి ఓ పల్లెటూరి కథ చేయడం ఇదే ప్రథమం కాగా రామ్‌చరణ్ మాత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో పల్లెటూరి బ్యాగ్రౌండ్ చిత్రం చేసి ఓకే అనిపించాడు.