శర్వానంద్ 'రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానంభవతి' చిత్రాలతో మంచి ఫామ్ లోకి వచ్చేసాడు. 'శతమానంభవతి' చిత్రంతో శర్వానంద్ ఇద్దరు బడా స్టార్స్ ని ఎదుర్కొని కలెక్షన్స్ ని కొల్లగొట్టి ఫ్యామిలీ హీరో అనిపించుకున్నాడు. ఈ సంక్రాంతికి బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంతో రాగా... చిరంజీవి తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నెంబర్ 150' తో వచ్చాడు. మరి ఇంతటి స్టార్స్ మధ్యన పెద్ద పోటీ ఉంటుంది. అయినా వారిద్దరి పోటీని తట్టుకుని నిలబడగలనని శర్వా మరోసారి ప్రూవ్ చేసాడు. బాలయ్య, చిరు మధ్యలో శర్వా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ కలెక్షన్స్ ని కొల్లగొట్టుకుని పోయాడు. ఇక శర్వానంద్ కి ఈ చిత్రంతో డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది.
ఇక వరసబెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఆ సినిమాలు చిన్న చితకవి కావు. పెద్ద బ్యానర్లు లో తన సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు కూల్ గా సమాధానం చెబుతున్నాడు. ఇప్పటికే లావణ్య త్రిపాఠితో కలిసి 'రాధ' చిత్రాన్ని బి.వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో చేస్తున్న శర్వానంద్ మరో మూడు పెద్ద బ్యానర్స్ లో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆర్కా మీడియా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో చిత్రాలు చెయ్యడానికి శర్వా కమిట్ అయ్యాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలన్నీ పూర్తి కాగానే మరోసారి దిల్ రాజు బ్యానర్ లో శర్వా నటిస్తాడని టాక్.
మరి పెద్ద బ్యానర్ లో సినిమాలంటే రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఉండాలి కదా... అందుకే శర్వానంద్ తాను 'శతమానంభావతి'కి 2.5 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటే ఇప్పుడు చేయబోయే సినిమాలకి 3 .5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట . మరి 30 కోట్ల క్లబ్బులో చేరిన శర్వానంద్ కి 3.5 కోట్లు ఇవ్వడం సమంజసమే అని నిర్మాతలు కూడా డిసైడ్ అయ్యి శర్వానంద్ అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. మరి వచ్చే చిత్రాలు కూడా హిట్ అయితే శర్వానంద్ రేంజ్ మరింతగా పెంచేస్తాడేమో చూద్దాం.