బాలకృష్ణ ఓ దర్శకునిపై నమ్మకం పెంచుకున్నాడంటే వరుస చిత్రాలకు అవకాశం ఇస్తూనే ఉంటాడు. నాటి కోడిరామకృష్ణ, కోదండరామిరెడ్డి, సింగీతం శ్రీనివాసరావుల నుంచి బి.గోపాల్ వరకు, తాజాగా బోయపాటి శ్రీను వరకు ఆయన రూట్ అదే. కాగా ప్రస్తుతం బాలయ్య తన 101 వ చిత్రంగా భవ్య ఆర్ట్స్‌లో చేయబోయే చిత్రం విషయంలో ఫ్లాప్‌లలో ఉన్న పూరీకి అవకాశం ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. కాగా ఇటీవలి కాలంలో పూరీ చిత్రాలు బాగా ఆడకపోవడానికి చార్మి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. పూరీకి కుడిభుజం వంటి యంగ్ టాలెంటెడ్ డైలాగ్ రైటర్స్ నుంచి అందరినీ ఆమె చిన్న చూపు చూస్తోందని, దాంతో చాలా మంది పూరీకి దూరంగా జరుగుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఇక బాలయ్య చిత్రం విషయంలో కూడా ఛార్మి ప్రముఖ పాత్రను పోషించనుండటంపై విమర్శలు వస్తున్నాయి. కొత్త చిత్రాలకు, లేదా 'జ్యోతిలక్ష్మి' వంటి చిత్రాలలాగా బాలయ్య చిత్రం కోసం పూరీ కొత్త వారిని పరిచయం చేయనుండటంపై కూడా విమర్శలు వస్తున్నాయి. పూరీకి ప్రయోగాలు చేయడానికి ఇది సరైన సమయం కాదని, అందునా బాలయ్య వంటి స్టార్ హీరో విషయంలో ఆయన ఇలా బిహేవ్ చేయడం మంచిది కాదనే సెటైర్లు వినిపిస్తున్నాయి.
కాగా ఈ విషయాన్ని పక్కనపెడితే బాలయ్య కొంత కాలం కిందట తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రపై కూడా ఓ చిత్రం చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అనౌన్స్‌మెంట్ తర్వాత ఈ చిత్రంలో చంద్రబాబును, లక్ష్మీపార్వతిని ఎలా చూపించనున్నారు? అని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పూర్తి జీవితం ఉండదని, కేవలం పాలుపోసే కుర్రాడు చిత్రపరిశ్రమను ఎలా ఏలాడు? ఎలా? ఎందుకు? తెలుగు దేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి కాగలిగి చరిత్ర సృష్టించాడు అనేంత వరకే ఈ చిత్రం కథ ఉంటుందని సమాచారం. ఈ లైన్‌ని కూడా బాలయ్యకు చెప్పింది పూరీనే అని తెలుస్తోంది. సో.. ప్రస్తుతం పూరీ.. బాలయ్య 101 వ చిత్రాన్ని కనుక హిట్ చేస్తే బాలయ్య.. ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాకు కూడా పూరీనే పెట్టుకోవడం ఖాయమంటున్నారు. మరి తన జాతకాన్ని మరలా మార్చుకొనే అవకాశం పూరీ చేతుల్లోనే ఉంది. మరో వైపు ఈ చిత్రం కోసం దర్శకుడు దేవా కట్ట కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది.