యంగ్‌రెబెల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'బాహుబలి-ది కన్‌క్లూజన్' ఎప్పుడు విడుదలవుతుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కాగా ఆయన తన తదుపరి చిత్రాన్ని 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బేనర్‌లో ఇప్పటికే లాంఛనంగా ప్రారంభించేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తో అంటే దాదాపు 150కోట్లతో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ చేయనున్నారు. పలు అద్భుత చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ మది, జాతీయ అవార్డులను ఎన్నో గెలుచుకున్న డిజైనర్ సాబుసిరిల్, బాలీవుడ్ సంగీత త్రయం శంకర్-ఇహసాన్-లాయ్‌లు ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. కాగా మొదట ప్లాన్ ప్రకారం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను బాహుబలి-ది కన్‌క్లూజన్ ఏప్రిల్ 28న విడుదలైన తర్వాత మేలో ప్రారంభించాలని ప్లాన్ చేశారు. తాజాగా వారు ఈ ఆలోచనలో చిన్న మార్పు చేసినట్లు సమాచారం. మార్చి, ఏప్రిల్ మొదటి వారంలో ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించి, 'బాహుబలి-ది కన్‌క్లూజన్'తో పాటే దేశవిదేశాలలో 'బాహుబలి2' విడుదల కానున్న వేలాది థియేటర్లలో ఈ చిత్రం టీజర్‌ను ప్రదర్శించాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. అలా చేస్తే సుజీత్ చిత్రానికి కూడా మొదటి నుంచే అన్ని భాషల్లో మంచి పబ్లిసిటీ, ప్రమోషన్ దొరుకుతుందనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నాడట. మొత్తానికి ప్రభాస్ 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రాన్ని తన తదుపరి చిత్రం పబ్లిసిటీ వాడుకోవడం భలే స్ట్రాటర్జీ అనే చెప్పాలి. మరి ఇది కార్యరూపం దాలుస్తుందో లేదో వేచిచూడాల్సివుంది.