ప్రస్తుతం పవన్ రాజకీయాలపై కూడా బాగా ఫోకస్ పెట్టాడు. రాష్ట్రంలోని విద్యావంతులు, కుల, మత రహిత సమాజాన్ని కోరుకుంటున్న తటస్తవాదులు, అభ్యుదయ భావాలు కలిగిన వారు పవన్‌కు, ఆయన జనసేనకు మద్దతు తెలుపుతున్నారు. సామాన్య ప్రజల్లో కూడా పవన్ మేనియా కనిపిస్తోంది. ఆయన చేసే ప్రతి ప్రసంగానికి, ప్రతి ట్వీట్‌కు ఎంతో ప్రచారం లభిస్తోంది. దీంతో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైయస్సార్‌సీపీ పార్టీలు జనసేనాధిపతి హవాను నిశ్శబ్దంగా గమనిస్తూనే చంద్రబాబు, జగన్‌లు తామే స్వయంగా రంగంలోకి దిగి పవన్‌ని చీల్చిచెండాడాలనే నిర్ణయానికి వచ్చేశారు. అదే విధంగా కిందిస్థాయి నాయకులకు కూడా అదే ఆదేశాలు జారీ చేశారని సమాచారం. ఇంతకాలం పోటీ తమ ఇద్దరి మధ్యే ఉంటుందని భావిస్తున్న టిడిపి, వైసీపీలు ఇప్పుడు జనసేన దూకుడును అంచనా వేయలేకపోతున్నాయి.
కాగా మరికొందరు మాత్రం పవన్ సినీ స్టార్ కావడంతో అంతగా మైలేజ్ వస్తోందని, కానీ ఎన్నికల్లో ఆ ప్రభావం ఉండదని తేల్చేస్తున్నారు. ఇక టిడిపి, వైసీపీలు తమకున్న అంగ, అర్థ, ఆర్థికబలంతో పలు సర్వేలు కూడా చేయించుకుంటున్నాయి. తమకు ఎన్ని సీట్లు వస్తాయి? మిగిలిన పార్టీలకు ఎన్ని వస్తాయి? అనే లెక్కలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. తాజాగా జనసేన అధికార ప్రతినిధి దిలీప్ అభిప్రాయం ప్రకారం.. ఎవరెన్ని సర్వేలు చేయించుకున్నా మా సొంత సర్వే మాకుంది. వచ్చే ఎన్నికల్లో మాకు రాష్ట్రంలోని 13 జిల్లాలలో 58 నుంచి 62 వరకు సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 2019లోనే కాదు... ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తమకు అన్నే సీట్లు వస్తాయని నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రజలంతా పవన్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారని, అలాగే తమకు మరో ప్రాంతీయపార్టీ లేదా జాతీయ పార్టీలతో పొత్తు కూడా అవసరం లేదని, తమ నాయకునికి అధికారం కంటే ప్రజల బాగోగులు ముఖ్యమని వ్యాఖ్యానించడం గమనార్హం. మరి ఈ దిలీప్ అనే అధికార ప్రతినిధి ఎవరో? ఆయన్ను పవన్ నియమించాడో లేదో కూడా తెలియదని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.