జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. కాటమరాయుడు షూటింగ్ చివరి దశలో ఉండగా ఈ చిత్రానికి గాను పవన్ కల్యాణ్‌కు తమ్ముడుగా నటిస్తున్న శివాబాలాజీ.. పవన్ ను షాక్ కు గురిచేశాడు. ఎవరూ ఊహించని గిఫ్ట్ తో శివబాలాజీ యూనిట్ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ ను కూడా ఆశ్చర్యానికి గురి చేశాడు. శివబాలాజీ ఓ అరుదైన కత్తిని తెచ్చి పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ కత్తి పిడిభాగంలో జనసేన లోగో ఉంటుంది. శ్రీచక్రం, పవన్ ఫొటో, సంభవామి యుగే యుగే అనే శ్లోకం.. కత్తిపై ముద్రించి ఉంది. అయితే బంగారు పూత పూసిన ఈ కత్తిని డెహ్రాడూన్‌లో శివబాలాజీ ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లుగా తెలుస్తుంది. కాగా ఈ కత్తితో పవన్ కళ్యాణ్, అలీతో ఆడుకోవడంతో వంటి దృశ్యాలన్నీ ఓ వీడియో ద్వారా విడుదల చేసింది చిత్రబృందం.
అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శివబాలాజీ మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ గారికి చాలా కాలం నుండి ఓ మంచి బహుమతిని ఇవ్వాలని ఉంది. కానీ ఇప్పుడు పవన్ రాజకీయ జీవితం వంటివి అన్నీ కలిసొచ్చేలా ఉంటే బాగుంటుంది అనుకున్నాం. జనసేన పార్టీ పెట్టి ప్రజల తరుపున పోరాడుతున్న యుద్ధ వీరుడి గెటప్ లో ఓ మంచి కత్తి డిజైన్ చేయించాం. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పేరు గుర్తుకురాగానే ఆవేశంతో కూడిన పవన్ ఫేస్ గుర్తుకొస్తుంది. దాన్ని లోగోగా ముద్రించాం.. అంటూ కత్తికి సంబంధించిన వివరాలను వెల్లడించాడు శివబాలాజీ. కాగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.