ఆమధ్యకాలంలో ఎలాంటి చిత్రమైనా, ఏ జోనర్ చిత్రమైనా సరే కామెడీకి పెద్ద పీట వేయని తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. సినిమాకు అవసరం ఉన్నా లేకపోయిన కామెడీ ట్రాక్‌లైనా పెట్టాల్సివచ్చేది. కానీ ఈ ఏడాది ఘన విజయం సాధించిన చిత్రాలను చూసుకుంటే కాస్త ఆ హవా తగ్గిందనే చెప్పాలి. కథలో అంతర్గంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే సరే.. లేకపోతే అనసరమైన కామెడీ సీన్లను ప్రేక్షకులు ఆదరించడం లేదు. చిరంజీవి 'ఖైదీనెంబర్150', బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలలో పెద్దగా కామెడీ లేదు. ఇక 'శతమానం భవతి'లో కావాలని ఇరికించిన కామెడీ సీన్స్‌లేవు. కానీ ఈ చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇక 'ఓం నమో వేంకటేశాయ'లో అనవసరంగా వచ్చిన కామెడీ ట్రాక్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
'నేను...లోకల్' చిత్రంలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నప్పటికీ అది హీరో చుట్టూ, ఆయన క్యారెక్టరైజేషన్ చుట్టూనే తిరుగుతుంది. ఇక బ్రహ్మానందం, ఆలీ, సప్తగిరి నుంచి 30ఇయర్స్ పృథ్వీల వరకు కథాపరమైన కామెడీని మాత్రమే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. బ్రహ్మి హవా తగ్గడం, సునీల్, సప్తగిరిలు హీరోలుగా మారడంతో వారికి కమెడియన్ పాత్రలు తగ్గాయి. ఇక 'విన్నర్' చిత్రంలో బిత్తిరి సత్తి బాగానే ఆకట్టుకున్నాడు. గోపీచంద్ 'గౌతమ్‌నంద', తేజ-రానాల 'నేనే రాజు.. నేనే మంత్రి', సునీల్-ఎన్.శంకర్‌ల టూ స్టేట్స్ రీమేక్‌లో, జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు నటించే చిత్రాలలో కూడా బిత్తిరిసత్తికి అవకాశాలు వచ్చినట్లు సమాచారం. కేవలం ఏదో ఐదు పదినిమిషాల ట్రాక్‌నైతే చూసే అవకాశం ఉన్నా, అవసరం లేని చోట్ల కామెడీని ఇరికిస్తే మాత్రం దర్శనిర్మాతలే ఇరుక్కుపోతారు.