దళితులు, బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన కులాల వారి రిజర్వేషన్స్ విషయాన్ని సమర్థిస్తూ, ఇంకా ఇంకా తమకు అవకాశాలు కల్పించాలనే కథతో, కుల విమర్శలతో 'శరణం గచ్చామి' చిత్రం రూపొందినట్లు సమాచారం. సినిమా చూడకుండానే ఓ నిర్ణయానికి రావడం తప్పు కాబట్టి ఈ విషయంలో ఇక విశ్లేషణ అనవసరం. కానీ ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డ్ కొంతకాలం కిందట సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు ఓ వర్గం వారి మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని, కాబట్టి శాంతిభద్రతల సమస్య రావచ్చని సెన్సార్ సభ్యులు భావించారు. కానీ కొన్ని విద్యార్థి, కుల యువత సంఘాలు ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరించడంతో ఆగ్రహించి, సెన్సార్‌బోర్డ్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.
దాంతో సెన్సార్‌బోర్డ్ వెంటనే హడావుడిగా ఈ చిత్రాన్ని చూసి, చిన్న చిన్న మార్పులతో యు/ఎ సర్టిఫికేట్‌ను మంజూరు చేయడం హర్షించదగ్గ పరిణామం. ఎందుకంటే భావప్రకటనా స్వేచ్చ పేరుతో మనకు రాజ్యాంగం అలాంటి హక్కులను ఇవ్వడమే. అయితే ఇక్కడ భావ ప్రకటనా స్వేచ్ఛ ఏ ఒక్క కులానికో, వర్గానికో సంబంధించినది కాదు... అందరికీ అది వర్తిస్తుంది. గతంలో అగ్రవర్ణాలలోని పేదల కడగండ్లను తెరపై చూపిస్తూ ' ఈ చదువులు మాకొద్దు, పోలీస్ భార్య' వంటి చిత్రాలు వచ్చాయి. కానీ ఆ చిత్రాలపై దళిత, బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల వారు ఆందోళనలు నిర్వహించి, ఆ చిత్రాలలోని ఎన్నో సీన్స్‌ను సినిమా రిలీజ్ చేసిన తర్వాత కూడా అల్లర్లు, ఆందోళనలు చేసి, దాదాపు ఆ చిత్రాలలోని ముఖ్య సారాంశాన్ని చూపించే సన్నివేశాలను కట్ చేయించారు. ఇది తప్పు. అగ్రవర్ణాల బాధలను చెప్పుకునే హక్కు వారికి కూడా ఉంది. కాబట్టి భవిష్యత్తులో అలాంటి చిత్రాలు వచ్చినప్పుడు ఈ సోకాల్డ్ కుల, రాజకీయ, విద్యార్థి సంఘాలు కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.