పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కాటమరాయుడు' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ చివరి దశకు చేరుకుంది. ఇక పాటల మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు సమాచారం. 'కాటమరాయుడు' చిత్రం ఫస్ట్ లుక్ తోనే ఆకట్టుకున్న పవన్ ఫస్ట్ టీజర్ తో తన స్టామినాని మరోసారి గుర్తు చేసాడు. 'కాటమరాయుడు' టీజర్ విడుదల చేసిన కొద్దీ గంటల్లో యూట్యూబ్ లో సంచలనాలు నమోదు చేసి భారీ అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమాకి సంబంధించి మొదట్లో ఆడియో వేడుక ఉంటుందని చెప్పినప్పటికీ ఈ ఆడియో ని క్యాన్సిల్ చేసి మెగా ఫ్యామిలీ సెంటిమెంట్ వలే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని భారీ లెవెల్లో జరిపించి పాటలని నేరుగా మార్కెట్ లోకి విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
ఇక మార్చి మొదటి వారంలోనే పాటలను మార్కెట్లో విడుదల చేసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని మర్చి 12న వైజాగ్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. మరి భారీ లెవెల్లో వైజాగ్ లో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని కనివిని ఎరుగని రీతిలో అభిమానులను ఉత్సాహ పరచడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఎలాగూ రాజకీయాల్లో పవన్ ఈ మధ్యన సమస్యలపై పోరాడుతూ సభలు నిర్వహిస్తూ బిజీగానే ఉంటున్నాడు. ఇక ఈ 'కాటమరాయుడు' ఫంక్షన్ ని కూడా అలా భారీ బహిరంగ సభ వలే ఈ వేడుక జరపడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నప్పటికీ పవన్ దీనికి అడ్డు చెప్పడం లేదట.
డాలి డైరెక్షన్లో రూపొందుతున్నఈ చిత్రంలో పవన్ కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. పాటలు మినహా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి నెలాఖరులో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.