తన కెరీర్ ప్రారంభంలో రామ్‌చరణ్ ఫక్తు కమర్షియల్, మాస్ మసాలా ఫార్ములాను నమ్ముకున్నాడు. అప్పుడు అవి ఆయనకు బాగానే కలిసొచ్చాయి. ఆ తర్వాత మాత్రం మొనాటనీ వచ్చింది. దీంతో రామ్‌చరణ్ కూడా రూటు మార్చాడు. 'ధృవ' చిత్రంలో కొత్తదనానికి పెద్ద పీట వేసాడు. ఈచిత్రం బాగా ఆడింది. చరణ్‌కు 'ఎ' సెంటర్స్‌లో మంచి ఇమేజ్‌ను తెచ్చింది. ఇక ఓవర్‌సీస్‌లో కూడా మెప్పించింది. ఇప్పుడు అదే బాటను అనుసరిస్తూ చరణ్ ప్రయోగాలకు మారుపేరుగా చెప్పుకునే క్రియేటర్ సుకుమార్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా విభిన్నంగా ఉండనుంది. కాగా దీని తర్వాత ప్రాజెక్ట్ ఎవరితో చరణ్ చేయనున్నాడు? అనేది ఆసక్తికరంగా మారింది. మణిరత్నం పేరు తెరమీదకు వచ్చింది. కాగా ఇటీవల 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో ఉమెన్స్‌డే సందర్భంగా ప్రసారం కానున్న షో కోసం సుహాసినితో పాటు ఆమె భర్త మణిరత్నం కూడా హైదరాబాద్ వచ్చి చరణ్‌తో చేయబోయే చిత్రం విషయంలో చిరుతో చర్చలు జరిపాడని సమాచారం. దీనికి చిరు, చరణ్‌లు ఇప్పటికే పచ్చజెండా ఊపారని సమాచారం.
ప్రస్తుతం మణి.. కార్తి హీరోగా 'చెలియా' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదలకానుంది. ఈ చిత్రం విడుదల కాకముందే మణిరత్నం.. చరణ్ చిత్రానికి సంబంధించిన లోకేషన్ల వేటలో బిజీగా ఉన్నాడట. జూన్ నుంచి చరణ్.. మణికి డేట్స్ ఇచ్చాడంటున్నారు. ఈ చిత్రాన్ని మణినే స్వయంగా నిర్మించనుండటం విశేషం. అలాగే ఈ మూవీని ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. బన్నీ కూడా త్వరలో తమిళ ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో చెర్రీ కూడా తమిళ్‌పై కన్నేయడం, అది కూడా మణిలాంటి లెజెండ్ ద్వారా కావడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని మణి తనదైన స్కూల్‌లో విభిన్నంగా తీస్తాడా? లేక చరణ్ స్కూల్‌లోకి వచ్చి సేఫ్‌గేమ్ ఆడుతాడా? లేక రెండింటిని మిక్స్ చేసి తన స్కూల్‌ను, చరణ్ స్కూల్‌ని కలుపుతాడా? అనే విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.