విజయ్ దేవరకొండ నటించిన 'పెళ్లి చూపులు' సినిమా అమెరికాలో మిలియన్ డాలర్లకిపైగా వసూలు చేసింది. దాంతో తదుపరి నటించిన సినిమా 'ద్వారక' విషయంలోనూ ఓవర్సీస్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. విజయ్ మళ్లీ మిలియన్ మార్క్ సాధించేనా అనే విషయంపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఆయన సినిమాకి ఓ బంపర్ ఆఫర్ తగిలింది. అది అట్టాంటి ఇట్టాంటి ఆఫర్ కాదు. మరోసారి విజయ్ దేవరకొండ మిలియన్ మార్క్ వసూళ్లు సాధించే దిమ్మతిరిగిపోయే ఆఫర్. అమెరికాలో పేరెన్నికగన్న మొబైల్ నెట్‌వర్క్ కంపెనీ టి - మొబైల్ నుంచి వచ్చిన ఆఫర్ అది. ఇటీవల కొన్ని సినిమాలకి ఆ కంపెనీ ఆఫర్లు ప్రకటిస్తోంది. తన మొబైల్ కంపెనీ యాప్ నుంచి టికెట్టు బుక్ చేసుకొంటే కేవలం 2 డాలర్లకే సినిమా చూసే అవకాశం కలుగుతుంది. 10 డాలర్లు నుంచి 15 డాలర్ల వరకు ఉన్న టికెట్టు రేటులో అంతగా డిస్కౌంట్ వస్తుందంటే ఎవరు మాత్రం ఆ ఆఫర్ వదలుకొంటారు. అందుకే ఆ ఆఫర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు అమెరికాలోని ప్రేక్షకులు.
అయితే ఇటీవల విడుదలైన చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' సినిమా విడుదల సమయంలోనూ ఆ ఆఫర్ని ప్రకటించింది టి మొబైల్. దాంతో తెలుగు ప్రేక్షకులు యమా క్రేజీగా ఆ యాప్ ద్వారా టికెట్టు బుక్ చేసి సినిమాని చూసేశారు. ఖైదీ నంబర్ 150కి పెద్దయెత్తున వసూళ్లు వచ్చాయి. అయితే చిరు సినిమాకి కేవలం ఒక్క రోజు మాత్రమే ఆ ఆఫర్ ఇచ్చారట. విజయ్ దేవరకొండ ద్వారక సినిమాకి మాత్రం 4 డాలర్ల టికెట్టు ధరతో ఆరు రోజులపాటు ఆ ఆఫర్ని ప్రకటించిందట టి-మొబైల్ కంపెనీ. అంటే ఒకరోజు టికెట్ బుక్ చేసుకుని వీలున్న రోజు ఆ సినిమాని చూడొచ్చు అన్నమాట. ఈ ఆఫర్ తో సినిమా యూనిట్‌లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. తన సన్నిహితులతో ఈ విషయాన్ని షేర్ చేసుకొంటూ విజయ్ దేవరకొండ చాలా హ్యాపీ మూడ్‌లో ఉన్నాడట. మరోసారి మిలియన్ మార్క్ ఖాయమని ఆయన నమ్మకంగా చెబుతున్నాడట. అనుకోనివిధంగా ప్రకటితమైన ఈ ఆఫర్‌తో అమెరికాలో సినిమాని విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్నట్టు తెలిసింది.