సినిమాల్లో కామెడీ వేషాలు వేసుకుంటూ ఉన్నట్టుండి ప్రొడ్యూసర్ అవతరమెత్తి బడా సినిమాలను బడా స్టార్స్ తో నిర్మించి వార్తల్లోకెక్కిన బండ్ల గణేష్ ఇప్పుడు గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయాడు. ఎటువంటి సినిమా నిర్మాణం చేపట్టకుండా గమ్మున కూర్చున్న బండ్ల మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంటున్నాడు. అయితే గణేష్ ఇంతగా గ్యాప్ తీసుకోవడానికి కారణం మాత్రం కొన్ని సినిమాల్లో భారీగా నష్టపోవడమేనట. డబ్బు నష్ట పోవడమే కాకుండా ఆయా హీరోలతో గొడవలు తెచ్చుకున్న బండ్ల ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడట.
అయితే బండ్ల గణేష్ కేవలం పెద్ద సినిమాలనే ప్రొడ్యూస్ చేస్తానని చెబుతున్నాడు. కేవలం పెద్ద సినిమాలకు ప్రొడ్యూస్ చేయడానికే ఈ రెండేళ్ల గ్యాప్ తీసుకున్నానని, లేకుంటే ఈ గ్యాప్లో పది చిన్న సినిమాలు నిర్మించేవాడినని చెబుతున్నాడు. మరి పెద్ద సినిమాలు తియ్యాలంటే పెద్ద హీరోల డేట్స్ దొరకాలిగా.. అందుకే ఇంతగా గ్యాప్ తీసుకున్నానని త్వరలోనే తన నిర్మాణ సంస్థ నుండి 5 పెద్ద సినిమాలను లైన్ లో పెట్టానని చెబుతున్నాడు ఈ నిర్మాత గారు. అయితే ఆ 5 సినిమాల వివరాలను త్వరలోనే మీడియాకి తెలుపుతానని చెబుతున్నాడు.
అయితే పెద్ద సినిమాలు తియ్యడానికి డబ్బులు అక్కర్లేదని... పెద్ద హీరో ల డేట్స్ దొరికితే డబ్బు దానంతటికదే వస్తుందట. నాకు బడా హీరోలతో ఉన్న సంబంధాలే నాకు ఆయా హీరోల డేట్స్ సంపాదించిపెట్టగలవనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి ఇప్పటికే పవన్ తో గొడవ పడ్డ బండ్ల కి పవన్ మళ్లీ డేట్స్ అడ్జెస్ట్ చేసి సినిమా చేసే అవకాశం ఇస్తాడా? అంటే అది డౌటే. మరి ఏ ధైర్యంతో బండ్ల ఇలా చెబుతున్నాడో ఆయనకే తెలియాలి అని అంటున్నారు.